Nara Lokesh :ఈ అంశంపై ఎవరు మాట్లాడవద్దు : టీడీపీ కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎం (Deputy CM) చేయాలన్న డిమాండ్లు వినిపిస్తోన్న నేపథ్యంలో టీడీపీ అధిష్ఠానం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశంపై ఎవరూ మాట్లాడవద్దని పార్టీ నేతలను ఆదేశించింది. ఎవరూ మీడియా వద్ద బహిరంగ ప్రకటనలు చేయవద్దని సూచించింది. ఏ నిర్ణయమైనా కూటమి నేతలు కూర్చొని మాట్లాడుకుంటారని స్పష్టం చేసింది. వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీపై రుద్దవద్దని పేర్కొంది. ఇటీవల సీఎం చంద్రబాబు(Chandrababu) మైదుకూరు పర్యటనలో ఉన్నప్పుడు కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి (Srinivas Reddy )మాట్లాడుతూ నారా లోకేశ్ (Nara Lokesh )కు ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఆ తర్వాత పలువురు నేతలు అదే అంశంపై బహిరంగంగా మాట్లాడారు. పార్టీతో సంబంధం లేకపోయినప్పటికీ ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలను వారు చెబుతున్నారు.
మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Chandramohan Reddy), మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ, రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కూడా నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎంను చేయాలని బహిరంగంగా వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వారు చెప్పడం సరికాదని పార్టీ అధిష్ఠానం భావించింది. ఇలాంటి సున్నితమైన అంశాలపై కూటమి నేతలు చర్చించి నిర్ణయం తీసుకుంటారని స్పష్టత ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై ఎవరూ మాట్లాడవద్దని పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేసింది.













