Jagan: జగన్ పర్యటనపై టీడీపీ ఫైర్..మామిడి పంట నాశనంపై తీవ్ర విమర్శలు

మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ( Jagan) బంగారుపాళ్యం (Bangarupalem) పర్యటన తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వేడి పెరిగేలా చేస్తోంది. ఈ పర్యటనపై తెలుగుదేశం పార్టీ (TDP) తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. ముఖ్యంగా జగన్ పర్యటన సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) కార్యకర్తలు మామిడి కాయలను రోడ్డుపై పారబోసి ట్రాక్టర్లతో తొక్కించిన ఘటనపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. టీడీపీ అధికారిక ఎక్స్ (X) ఖాతా ద్వారా సంబంధిత వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తూ వరుసగా పదికి పైగా ట్వీట్లు చేశారు.
టీడీపీ వర్గాలు ఈ పూర్తి పర్యటనను “ఈవెంట్ పాలిటిక్స్”గా అభివర్ణించాయి. గతంలో గుంటూరు (Guntur) జిల్లాలో మిర్చి రైతులను పరామర్శించే పేరిట మిర్చి బస్తాలను మాయం చేయడం, తరువాతి దశలో పొగాకు రైతుల పరామర్శ పేరిట పొగాకు బేళ్లను ధ్వంసం చేయడం, ఇప్పుడు మామిడి రైతుల పరామర్శ పేరిట మామిడి పంటనే రోడ్డుపై పారబోసి నాశనం చేయడమంటూ వ్యంగ్యంగా స్పందించింది. జగన్ మార్క్ పరామర్శ అంటే ఇదేనని, ఇది దొంగతనం, ధ్వంసం, నాశనం కలగలసిన నాటకమేనని విమర్శలు గుప్పించింది.
ఒక ప్రత్యేక ట్వీట్‌లో, జగన్ పర్యటన కోసం మామిడి కాయలను ముందుగానే తెప్పించి, ఆయన కాన్వాయ్ రాక ముందు రోడ్డుపై పోసి డాక్యుమెంటరీలా వీడియోలు తీసి ప్రచారం చేయడమే లక్ష్యంగా ఈ సన్నివేశం సృష్టించారని ఆరోపించారు. దీనిని ‘‘స్క్రిప్ట్ ప్రకారం నడిచిన డ్రామా’’గా పేర్కొన్నారు.
తద్వారా, వైసీపీ కార్యకర్తలు జగన్ మెప్పు కోసం రైతులు పండించిన పంటను నాశనం చేస్తున్నారని, వీరి చర్యలు పైశాచికంగా ఉన్నాయని టీడీపీ ట్వీట్‌లో ఘాటు వ్యాఖ్యలు చేశారు. మామిడి కాయలను రోడ్డుపై పారబోసి, ట్రాక్టర్లతో తొక్కిస్తూ, అక్కడే డ్యాన్సులు చేసిన వీడియోలను షేర్ చేస్తూ ‘‘ఇవి రైతుల సమస్యలపై బాధపడే వారి చర్యలేనా?’’ అని నిలదీశారు.
జగన్ రాక సందర్భంగా రోడ్డుపై మామిడి పంటను బలిచేసిన ఈ సంఘటనపై పలువురు విశ్లేషకులు కూడా స్పందించారు. జగన్ కాన్వాయ్ కింద పడేలా మామిడి కాయలు వేయడం దారుణమని, రైతుల శ్రమను రాజకీయ ప్రయోజనం కోసం ఉపయోగించడాన్ని తప్పుపట్టారు.దీనిపై వైసీపీ ఓ కౌంటర్ మాత్రమే ఇచ్చింది. టీడీపీ జగన్ పర్యటనలో జనం లేరని పోస్టు చేసిన ఫొటోకు బదులుగా భారీ జనసందోహంతో జగన్ ఉన్న ఫొటోను షేర్ చేస్తూ, తమపై వచ్చిన ఆరోపణలు ఫేక్ ప్రచారమేనని తేల్చేసింది.ఈ వివాదం నేపథ్యంలో రాజకీయాలు మరింత వేడెక్కుతాయని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.