విశాఖ గ్యాస్ లీకేజీ మృతుల కుటుంబాలకు టీడీపీ రూ.50 వేల సాయం
విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ దుర్ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ తరపున ప్రకటించిన ఆర్థిక సాయాన్ని నేడు అందజేయనున్నారు. ఈ దుర్ఘటనలో 15 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మృతులకు సంబంధించి ఒక్కో కుటుంబానికి రూ.50 వేల చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని చంద్రబాబు పార్టీ బాధ్యులను ఆదేశించారు. ఈ మేరకు స్థానిక ఎమ్మెల్యే గణబాబు ఆధ్వర్యంలో విశాఖ జిల్లా టీడీపీ నాయకులు మృతుల కుటుంబాలను కలిసి, ఆర్థిక సాయంపై చంద్రబాబు లేఖను అందజేయనున్నారు. మృతుల కుటుంబాలకు పార్టీ తరపున పూర్తి అండదండలు అందిస్తామని, అస్వస్థత పాలైన బాధితులకు కూడా అన్నివిధాలా అండగా ఉంటామని తెలియజేయాల్సిందిగా విశాఖ పార్టీ నాయకులకు చంద్రబాబు సూచించారు.













