చంద్రబాబు అధ్యక్షతన తెదేపా సమన్వయ కమిటీ సమావేశం
ముఖ్యమంత్రి నివాస ప్రాంగణంలోని ప్రజా దర్బారు హాల్లో చంద్రబాబు అధ్యక్షతన తెదేపా సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ప్రస్తుత రాష్ట్ర రాజకీయ పరిస్థితిపై సమావేశంలో చర్చించారు. విభజన హామీల పట్ల ఆయా పార్టీల అజెండా ఎలా ఉన్నా…. మనం మాత్రం ప్రజల మనోభావాలకు అనుగుణంగా వెళ్దామని నేతలతో చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాలే ప్రధాన అజెండా అన్న ఆయన…. వైకాపా రోజుకో మాట మాట్లాడుతోందని దుయ్యబట్టారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టగానే బాగుంది అని తొలుత పొగిడింది వైకాపానేనని గుర్తుచేశారు.
ప్రత్యేక హోదా విషయంలో తెలుగుదేశం పార్టీ ఎక్కడా రాజీపడలేదన్న చంద్రబాబు… ప్రత్యేక హోదా ప్రయోజనాలను ప్రత్యేక ప్యాకేజీ పేరిట అయినా మరే పేరుతో ఇచ్చినా అవన్నీ రాష్ట్రానికి దక్కించుకోవటమే తెలుగుదేశం పార్టీ అజెండా అని తెదేపా శ్రేణులకు స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా ఎవరికీ ఇవ్వడం లేదని 14వ ఆర్థిక సంఘం చెప్పిందని కేంద్రం వివరిస్తే.. ప్యాకేజీకి ఒప్పుకున్నామని ఇప్పుడు వేరే రాష్ట్రాలకు ఎలా ఇస్తోందని ఆయన ప్రశ్నించారు. ఏపీకి ఇవ్వటానికే ఇబ్బంది ఎందుకని నిలదీసిన ఆయన.. వేరే వాళ్లకి ఇచ్చినప్పుడు మనకూ ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పారు. హోదానా? లేదా ప్యాకేజీనా? ఏ పేరుతో ఇచ్చినా ఫర్వాలేదని.. హోదాలో ఉన్న ప్రయోజనాలు మాత్రం రాష్ట్రానికి దక్కాల్సిందేనని చంద్రబాబు స్పష్టం చేశారు.
ప్రత్యేక హోదా అనే ఓ సెంటిమెంట్ సృష్టించి ప్రతిపక్ష నేత ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడని…. రాష్ట్రానికి ఎలాగైనా న్యాయం జరగకూడదనే దుర్భుద్దితోనే జగన్ రాజీనామాల నాటకం ఆడుతున్నాడని చంద్రబాబు ఆక్షేపించారు. కాంగ్రెస్ అన్యాయం చేసింది కదా అని బీజేపీ న్యాయం చేస్తుంది అనుకుంటే ఆ పార్టీ కూడా అలానే ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు. అవిశ్వాస తీర్మానానికి 54మంది మద్దతు కావాలన్న ఆయన…, కేంద్ర ప్రభుత్వానికి మెజారిటీ స్పష్టంగా ఉన్నప్పుడు అవిశ్వాసం పెడితే రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరతాయా అని ప్రశ్నించారు. అన్ని పార్టీల మద్దత కూడగట్టి కేంద్రంపై ఒత్తిడి పెంచితే రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు













