లోకేష్ ఫోన్ ట్యాప్! ఈసీకి టీడీపీ కంప్లైంట్
తమ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫోన్‌ను ట్యాప్ చేశారంటూ భారత ఎన్నికల కమిషన్‌కు తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కొందరు పోలీస్ అధికారులు తమ నాయకుడి ఫోన్ ట్యాప్ చేస్తున్నారంటూ టీడీపీ తమ ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు రాజ్యసభ మాజీ సభ్యుడు కె.రవీంద్రకుమార్.. శుక్రవారం ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు లేఖ రాశారు. పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి, గుర్తుతెలియని ఏజెన్సీల ద్వారా ఫోన్ ట్యాప్ అవుతోందంటూ లోకేష్ ఐ-ఫోన్‌కు హెచ్చరికలు కూడా అందినట్లు ఆయన పేర్కొన్నారు. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు.. వైఎస్సార్సీపీకి తొత్తులుగా మారారని, ఆంధ్రాలో జరగబోతున్న లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాల గెలుపు అవకాశాలను దెబ్బతీసేందుకు అనైతిక, చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడుతున్నారని రవీంద్రకుమార్ రాసుకొచ్చారు.
ఏడాది క్రితం నుంచే రాజేంద్రనాథ్‌రెడ్డి ఏపీ డీజీపీగా కొనసాగుతున్నారని, ఇది సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమేనని రవీంద్రకుమార్ పునరుద్ఘాటించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆంజనేయులు నమ్మినబంటని, ఆయనపై ఇప్పటికే ప్రభుత్వ పక్షపాత వైఖరితో వ్యవహరిస్తారనే ఆరోపణలున్నాయని టీడీపీ నేత తన ఫిర్యాదులో ఆరోపించారు. వెంటనే ఈ అధికారులపై చర్యలు తీసుకోవాలని, వారి స్థానాల్లో తటస్థ అధికారులను నియమించి, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా చూడాలని టీడీపీ నేత రవీంద్రకుమార్ ఈసీని కోరారు.













