టీడీపీ యాక్షన్ ప్లాన్.. కొత్త ప్రక్రియకు శ్రీకారం
ప్రజలతోపాటు కార్యకర్తలు, నేతల భవిష్యత్తుకు గ్యారెంటీ ఉండేలా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సరికొత్త కార్యాచరణ ప్రకటించారు. పార్టీ ముఖ్య నేతలతో సమావేశమై చంద్రబాబు వచ్చే ఎన్నికలకు సన్నద్ధతపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ఓటు రూపంలో అనుకూలంగా మార్చుకునే విధానాన్ని చంద్రబాబు నేతలకు వివరించారు. బూత్ స్థాయి నుంచి ఇన్ఛార్జ్ వరకూ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకునేలా రూపొందించిన కార్యాచరణను నేతల ముందు ఆవిష్కరించారు. బూత్ స్థాయి నుంచి ఇన్ఛార్జ్ వరకు ప్రతి ఒక్కరి పనితీరుపై రెండేసి సర్వేలు నిర్వహిస్తూ ప్రతి నెలా నివేదిక ఇచ్చే ప్రక్రియకు చంద్రబాబు శ్రీకారం చుట్టారు.
ప్రతి నియోజకవర్గంలో గత మూడు ఎన్నికల ఫలితాలు విశ్లేషించి తాజా పరిస్థితులకు తగ్గట్టుగా నేతలకు కమిటీలు యాక్షన్ ప్లాన్ ఇవ్వనున్నాయి. ఇందుకోసం ప్రతీ నియోజకవర్గానికి బ్యాక్ ఆఫీస్ బృందంగా దాదాపు 10 మంది సభ్యులతో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. బూత్ కమిటీలు, క్లస్టర్ ఇన్ఛార్జ్, యూనిట్ ఇన్ఛార్జ్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పనితీరును కమిటీ సభ్యులు మదింపు చేయనున్నారు. ఏ స్థాయిలో పొరపాటు ఉంటే ఆ స్థాయిలోనే సరిదిద్దుకునేలా కమిటీలు ప్రతినెలా నివేదికలు ఇవ్వనున్నాయి. నాలుగు స్థాయిలో ప్రతీ ఒక్కరి పనితీరును పరిశీలించి వారికి పదవుల్లో ప్రాధాన్యత కల్పించాలని నిర్ణయించినట్లు స్పష్టం చేశారు.













