సచివాలయ ఉద్యోగుల మృతి బాధాకరం : చంద్రబాబు
ఏపీ సచివాలయ ఉద్యోగుల మృతి బాధాకరమని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం నిర్లక్ష్యం, ప్రణాళికాలోపమే ఉద్యోగుల మృతికి కారణమని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి ప్యాలెస్ దాటడం లేదన్నారు. జగన్ అలసత్వం వల్లే రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగులందరికీ తక్షణమే టీకా అందించాలని కోరారు. కరోనా బారిన పడిన ఉద్యోగులకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు ఇంటి నుంచే విధులు నిర్వర్తించే అవకాశం కల్పించాలని తెలిపారు.
ఆదాయం కోసం మద్యం దుకాణాల వద్ద ఉపాధ్యాయులకు డ్యూటీలు వేసి మరీ వేధించారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ టీకాలు వేసే పక్రియ వెంటనే పూర్తి చేయాలన్నారు. ఉద్యోగులకు ఎన్-95 మాస్కులు, పీపీఈ కిట్లు, శానిటైజర్ వంటివి అందించటంతో పాటు, కరోనా బారిన పడిన ప్రభుత్వ, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ మెరుగైన వైద్యం ఉచితంగా అందించాలని సూచించారు. విశ్రాంత ఉద్యోగుల ఆరోగ్యంపైనా శ్రద్ధ చూపాలని డిమాండ్ చేశారు.













