ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు జగన్ కు ఉందా? : చంద్రబాబు
గతంలో శాసనమండలి రద్దు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసిన ముఖ్యమంత్రి జగన్కు ఇప్పుడు పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు ఉందా? అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. పట్టభద్రుల నియోజకర్గ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎన్నికలపై పార్టీ ఇన్ఛార్జ్లు, ముఖ్యనేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తన మాట నెగ్గలేదనే అహంకారంతో నాడు జగన్ ఏకపక్షంగా మండలి రద్దుకు తీర్మానం చెయ్యలేదా అని నిలదీశారు. మండలి వ్యవస్థను అగౌరవ పరిచిన ముఖ్యమంత్రి, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థులను నిలబెట్టి ఓట్లు అడుగుతారని మండిపడ్డారు.
రాష్ట్రంలో తీవ్రంగా ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతను తెలుగుదేశానికి అనుకూలంగా మార్చుకోవాలని, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ నిలబెట్టిన అభ్యర్థులను గెలిపించాలని నేతలకు సూచించారు. పాలనలో అన్ని విధాలుగా విఫలమైన జగన్ తీవ్ర అసహనంతో ఉన్నారని, అందులో భాగాంగానే రాష్ట్రంలో టీడీపీ నేతల పర్యటనలు, సభలపై ఆంక్షలు పెడుతున్నారని విమర్శించారు. ప్రజలు ప్రభుత్వ వ్యతిరేక గళం వినిపిస్తుండటంతో దాడులు, హింసాత్మక ఘటనలతో భయపెట్టాలనే ప్రయత్నాలు మొదలు పెట్టారని దుయ్యబట్టారు. కరుడుగట్టిన ఉగ్రవాదిలా సీఎం ప్రవర్తిస్తుంటే, కొందరు పోలీసులు బాధ్యత మరిచి జగన్కు ఊడిగం చేస్తున్నారని మండిపడ్డారు.













