ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ప్లాస్మా దానం : చంద్రబాబు

ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా అవకాశం ఉన్న ప్రాంతాల్లో ప్లాస్మా దానం చేపట్టడంతో పాటు కొవిడ్ లక్షణాలు ఎక్కువగా ఉన్నవారిని ఆసుపత్రుల్లో చేర్పించే ప్రయత్నం చేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలిపారు. నిరుపేద కొవిడ్ బాధితులకు ఉచితంగా మందులు పంపిణీ చేస్తామని, హోం ఐసొలేషన్‍లో ఉండి, స్వల్ప లక్షణాలతో బాధపడేవారికి ఆన్‍లైన్ ద్వారా వైద్య సలహాలు అందిస్తామని అన్నారు.
అధికారంలో ఉన్నా, లేకున్నా ఆపదలో ఉన్నవారికి నిరంతర సేవలు అందించటమే మా ధ్యేయం. ప్రజలకు ఎప్పుడు, ఏ కష్టం వచ్చినా ఆదుకోవడంలో ముందుంటాం. ప్రతి ఒక్కరూ టీకా వేయించుకునేలా పార్టీపరంగా తోడ్పాటు ఇవ్వనున్నట్లు తెలిపారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లుగా భావించి ప్రజాసేవకే అంకితమైన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు. ప్రస్తుత కరోనా విపత్తులో మా వంతు సహాయం అందిస్తామన్నారు. క్రమశిక్షణ కలిగిన సైనికుల్లా విపత్కర పరిస్థితుల్లో సేవలందించేందుకు కార్యకర్తలు సిద్దంగా ఉన్నారు. కొవిడ్ లక్షణాలు ఉన్నవారు ఆన్‍లైన్ లో తమ ఇబ్బందులను వైద్యులకు చెప్తే అవసరమైన మందులు సూచిస్తారు. ఎవరికీ ఏ అవసరం ఉన్నా సమీప పార్టీ కార్యాలయాల్లో సంప్రదించాలి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కరోనా నుంచి అంతా విముక్తి పొందాలని ఆశిస్తున్నా అని పేర్కొన్నారు.