రేపో ఎల్లుండో అరెస్ట్ చేస్తారేమో.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. రేపో ఎల్లుండో తనను అరెస్టు చేయవచ్చన్నారు. వైసీపీ ప్రభుత్వం తనపై తప్పుడు కేసులు పెడుతోందని ఆరోపించారు. అయినా తాను వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని చంద్రబాబు తేల్చి చెప్పారు. తనపై ఇంతకుముందు కూడా చాలా మంది కేసులు పెట్టారని.. కానీ అవన్నీ నిలవలేదని ఆయన గుర్తు చేశారు. అయితే తనను అరెస్ట్ చేస్తారేమో.. అని చంద్రబాబు చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. గతంలో ఎన్నడూ చంద్రబాబు అరెస్టుపై మాట్లాడలేదు. కేసులపై పలు సందర్బాల్లో మాట్లాడారు కానీ అరెస్టుపై స్పందించడం ఇదే తొలిసారి.
చంద్రబాబుకు ఇటీవల ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో కాంటాక్ట్ సంస్థల నుంచి ముడుపులు అందాయనేది ఆ నోటీసుల సారాంశం. దానిపై వివరణ ఇవ్వాల్సిందిగా ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ చంద్రబాబుకు నోటీసులు ఇచ్చింది. 2016 నుంచి 2019 మధ్య కాలంలో వివిధ ఇన్ఫ్రా స్ట్రక్చర్ కాంట్రాక్ట్ సంస్థల నుంచి రూ.118 కోట్ల రూపాయల ముడుపులు చేతులు మారాయనేది ఐటీ శాఖ చేస్తున్న ఆరోపణ. 2016లో చంద్రబాబు పీఏ శ్రీనివాస్ ద్వారా షాపూర్జీ పల్లోంజీ సంస్థ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ సబ్ కాంట్రాక్టర్ అవతారం ఎత్తారు. ఆయన ఇంటిపై ఐటీ శాఖ దాడులు చేసినప్పుడు పలు ఆధారాలు బయటపడ్డాయి.
మనోజ్ వాసుదేవ్ ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా ఐటీ శాఖ అధికారులు పలు ఆధారాలు సేకరించారు. వాట్సాప్ చాట్ లతో పాటు.. బ్యాంకు స్టేట్ మెంట్లు సేకరించారు. వీటిలో చంద్రబాబు పీఏ శ్రీనివాస్ ద్వారా డబ్బులు చేతులు మారినట్లు రుజువైంది. వీటి ఆధారంగానే చంద్రబాబుకు ఐటీశాఖ నోటీసులు ఇచ్చింది. అంతేకాక.. పార్టీ ఫండ్ ఇవ్వాల్సిందిగా శ్రీనివాస్.. మనోజ్ వాసుదేవ్ పై ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. దీని పైన కూడా ఐటీ శాఖ మరో నోటీసు ఇచ్చింది. వీటిపై చంద్రబాబు ఇప్పటికే సమాధానం ఇచ్చారని.. అయితే ఐటీ శాఖ సంతృప్తి చెందలేదని తెలుస్తోంది.
కానీ ఇప్పుడు చంద్రబాబు తనను అరెస్ట్ చేస్తారేమో అని చెప్పడం వెనుక మరో కారణం ఉంది. చంద్రబాబు హయాంలో ఐటీతోపాటు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో భారీగా అవినీతి జరిగిందని ఇప్పటికే ఏపీ ప్రభుత్వం గుర్తించింది. దీనిపై కేసు కూడా నమోదు చేసింది. ఇప్పుడు చంద్రబాబుకు ఐటీ శాఖ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఏపీ సీఐడీ కూడా రంగంలోకి దిగుతోంది. వీటి మూలాలు కూడా మనోజ్ వాసుదేవ్ దగ్గర ఉన్నాయన్న సమాచారంతో వారికి నోటీసులు ఇచ్చి విచారించనుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబును కూడా విచారించే అవకాశం కనిపిస్తోంది. అందుకే తనను అరెస్ట్ చేస్తారేమో అని చంద్రబాబు వెల్లడించారు. మరి ఈ కేసులో ఏం జరుగుతుందనేది వేచి చూడాలి.













