క్రిస్మస్ వేడుకల్లో టీడీపీ అధినేత చంద్రబాబు
క్రైస్తవ సంక్షేమానికి టీడీపీ ప్రభుత్వం హయాంలో అనేక చర్యలు చేపట్టామని తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. క్రిస్మస్ సందర్భంగా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో, విజయవాడలోని సెయింట్ కేథడ్రల్ చర్చిలో నిర్వహించిన వేడుకల్లో చంద్రబాబు పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించేందుకు శాసనసభలో తీర్మానం ఆమోదించి కేంద్రాన్ని పంపామన్నారు. టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన క్రిస్మస్ కానుకలను ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేయడం బాధాకరమన్నారు. క్రైస్తవ ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఇచ్చిన ఆర్థికసాయాన్ని రద్దు చేశారన్నారు. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా సంక్షేమ పథకాలుండాలి కానీ.. పేదల సంక్షేమ పథకాలను ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా రద్దు చేయకూడదని చంద్రబాబు అన్నారు. క్రైస్తవుల కోసం గుంటూరులో రూ.16 కోట్లతో క్రిస్టియన్ భవన్‌ను నిర్మించామని ఆయన పేర్కొన్నారు. పాస్టర్లకు చంద్రన్న బీమా అందించామని, వారికి గృహ వసతి అందించేందుకు కృషి చేశామని, విద్యార్థుల విదేశీ విద్యకు రూ.15 లక్షలు ఇచ్చామని, నెలకు 150 యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా ఇచ్చామని వివరించారు.













