టీడీపీ తరపున పీకే.. వైసీపీకి ఐ ప్యాక్..
ఏపీలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి.పార్టీలు ట్రెండ్ ను బట్టి వ్యూహాలు సైతం మార్చేస్తున్నాయి. మరో మూడునెలల్లో ఎన్నికలు జరగనుండడంతో.. ఎలాంటి వ్యూహాలు అవలంభించాలి.. ఏం చేయాలన్న దానిపై వైసీపీ తరపున ఐప్యాక్ టీమ్ పకడ్బందీ వ్యూహాలు రచిస్తోంది. మరోవైపు టీడీపీకి రాబిన్ శర్మ పనిచేస్తూ వస్తున్నారు. అయితే తాజాగా చంద్రబాబుతో .. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సమావేశం ఆసక్తికర చర్చకు దారితీసింది. చంద్రబాబు దేశ రాజకీయాలలోనే సీనియర్ రాజకీయ నాయకుడని, తనను కలవాలని కోరడంతోనే ఆయనతో భేటీ అయ్యానని పీకే వెల్లడించారు. అయితే, మర్యాదపూర్వకంగానే చంద్రబాబును కలిశానని పీకే చెప్పారు.
ముఖ్యంగా జనసేనతో టీడీపీ పొత్తు, సీట్ల పంపకాలు, చంద్రబాబు-పవన్ కలయికను.. ప్రభావవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం, అనుసరించాల్సి వ్యూహాలపైనా చర్చ జరిగినట్లు సమాచారం. ఇప్పటికే రాబిన్ టీమ్.. చేసిన సర్వేలను సైతం టీడీపీ.. పీకేకు చూపించినట్లు తెలుస్తోంది. పీకే కనుక టీడీపీకి వ్యూహకర్తగా మారితే.. ఆయన ఆద్వర్యంలో రాబిన్ టీమ్ పనిచేయాల్సి ఉంటుంది. అప్పుడు టీడీపీ సోషల్ మీడియాను సైతం పీకే హ్యాండ్లింగ్ చేసే అవకాశముంటుందని సమాచారం.
మరోవైపు, తాము వైసీపీతోనే ఉన్నామంటూ ఐ ప్యాక్ సంస్థ అధికారికంగా తన ట్విట్టర్ ఖాతాలో ప్రకటించింది. గత ఏడాది కాలంగా వైసీపీతో ఐప్యాక్ కలిసి పనిచేస్తోందని ఆ సంస్థ స్పష్టం చేసింది. 2024 ఎన్నికల్లో సీఎం జగన్ ఘన విజయం సాధించి మరోసారి అధికారం చేపడతారని, ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాలను మరింత మెరుగుపరుస్తారని ఆశాభావం వ్యక్తం చేసింది. అలా చేయడమే లక్ష్యంగా వైసీపీతో కలిసి అంకితభావంతో అవిశ్రాంతంగా కృషి చేస్తున్నామని ఐ ప్యాక్ టీం వెల్లడించింది.
ఐ ప్యాక్ తాజా ప్రకటనతో ఐప్యాక్ కు ప్రశాంత్ కిషోర్ కు సంబంధం లేదని స్పష్టమైనట్టు కనిపిస్తోంది. వాస్తవానికి చంద్రబాబు అరెస్టును ఐప్యాక్ టీం వ్యతిరేకించిందని, కానీ జగన్ వారి మాటలను పెడచెవిన పెట్టి ముందుకు వెళ్లారని సమాచారం.అయితే, ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం మరికొంత కాలం వైసీపీతోనే ఐప్యాక్ కలిసి పనిచేయాల్సి ఉంటుంది. అంటే, వైసీపీ కోసం ఐ ప్యాక్…చంద్రబాబు కోసం పీకే పని చేయబోతున్నారని తెలుస్తోంది.













