ఏపీలో విపక్షాల షాకింగ్ డెసిషన్..!
నీలం సాహ్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన వెంటనే రంగంలోకి దిగిపోయారు. పెండింగ్ లో ఉన్న పరిషత్ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించారు. ఈ నెల 8న పోలింగ్ నిర్వహించి.. 10న ఫలితాలు వెల్లడించనున్నట్టు ప్రకటించారు. గతంలో ఎన్నికలు ఎక్కడైతే నిలిచిపోయాయో.. అక్కడి నుంచే ఈ ప్రక్రియను మొదలు పెడుతున్నట్టు ఎన్నికల కమిషనర్ స్పష్టంగా పేర్కొన్నారు. ఇదే వివాదాలకు కారణమవుతోంది.
పరిషత్ ఎన్నికలపై చర్చించేందుకు నిన్న నీలం సాహ్ని ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. చీఫ్ సెక్రటరీ, పంచాయతీరాజ్ కమిషనర్ సహా కలెక్టర్లు, ఎస్పీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎన్నికలకు ఎప్పుడైనా సిద్ధంగా ఉండాలని కోరారు. ఎన్నికల అంశం కోర్టులో ఉందని.. తీర్పు రాగానే ముందుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. దీంతో ఇప్పట్లో ఎన్నికలు జరిగే అవకాశం లేదని.. కోర్టు తీర్పు వచ్చాకే జరుగుతాయని అందరూ భావించారు. ఇదే సమయంలో రాజకీయ పార్టీలతో కూడా సమావేశం కావాలని ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని నిర్ణయించారు. ఇవాళ ఉదయం 11 గంటలకు రాజకీయ పార్టీలకు ఆహ్వానం పంపించారు. దీంతో రాజకీయ పార్టీలతో భేటీ తర్వాత ఎన్నికల ప్రక్రియపై ముందుకెళ్లే అవకాశం ఉంటుందని అందరూ భావించారు.
అయితే రాజకీయ పార్టీలతో సమావేశం కాకముందే పరిషత్ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించేశారు నీలం సాహ్ని. ఇది అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఎన్నికలపై చర్చించేందుకు రాజకీయ పార్టీలను సమావేశానికి ఆహ్వానించి.. ఈలోపే షెడ్యూల్ విడుదల చేయడమేంటని విపక్షాలు ప్రశ్నిస్తున్నారు. కేవలం అధికార పార్టీకి మేలు చేసేందుకే ఎన్నికల కమిషనర్ ఇలా వ్యవహరిస్తున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. ఎన్నికల అంశం కోర్టులో ఉందని.. ఈలోపే షెడ్యూల్ ప్రకటించడం నియమాలు ఉల్లంఘించడమేనని స్పష్టం చేశారు.
నీలం సాహ్ని తీరును నిరసిస్తూ టీడీపీ, బీజేపీ, జనసేన ఇవాల్టి సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు ప్రకటించాయి. ఓ వైపు సమావేశానికి పిలిచి.. చర్చించకముందే మరోవైపు షెడ్యూల్ విడుదల చేయడాన్ని ఈ పార్టీలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి. ఈ అంశంపై చర్చించేందుకు టీడీపీ పొలిట్ బ్యూరో అత్యవసరంగా భేటీ అయింది. మరోవైపు అధికార పార్టీకి మేలు చేసేందుకే ఇలా వ్యవహరిస్తున్నారంటూ జనసేన, బీజేపీ మండిపడ్డాయి. అందుకే తాము సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు ప్రకటించాయి. అవసరమైతే ఈ ఎన్నికలను కూడా బహిష్కరించేందుకు టీడీపీ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. మరి బీజేపీ, జనసేన ఎలా వ్యవహరిస్తాయనేది వేచి చూడాలి. జనసేన ఈ అంశంపై ఇప్పటికే కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై రిట్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తోంది.













