టీడీపీ కైవసమైన కాకినాడ కార్పొరేషన్
కాకినాడ నగర పాలక సంస్థ ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీ సత్తా చాటింది. 35 డివిజన్లలో చారిత్రక విజయంతో కాకినాడ పీఠంపై పసుపు జెండా రెపరెపలాడింది. రాష్ట్రంలో రాజకీయ వేడిపుట్టించిన ఈ ఎన్నికల్లో నగరపాలక సంస్థను తెలుగుదేశం కైవసం చేసుకొని చారిత్రక విజయం సాధించింది. 30 ఏళ్ల సుదీర్ఘకాలం తర్వాత కాకినాడ మేయర్ పీఠాన్ని సొంతం చేసుకుంది. పుష్కర కాలం తర్వాత జరిగిన ఈ ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధికే పట్టం కట్టారు. మొత్తం 48 డివిజన్లకు జరిగిన ఈ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమి అత్యధిక స్థానాలను కైవసం చేసుకొని విజయ ఢంకా మోగించింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి ఆధిక్యంలో దూసుకుపోయిన తెదేపా కూటమి అభ్యర్థులు 35 స్థానాల్లో (బీజేపీ 3) గెలుపొందారు. మరోవైపు ప్రధాన ప్రతిపక్షమైన వైకాపా 10 స్థానాల్లో విజయం సాధించింది. ఇతరులు మూడు స్థానాల్లో గెలుపొందారు.













