ఘనంగా టీడీపీ ఆవిర్భావ వేడుకలు : చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ 40 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకుందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో 40 ఏళ్ల ప్రస్థానంపై ప్రత్యేక లోగోను చంద్రబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుజాతి కష్టాల్లో ఉన్నప్పుడు ఎన్టీఆర్ పార్టీ పెట్టారన్నారు. కూడు, గూడు, గుడ్డ నినాదంతో ఎన్టీఆర్ పార్టీని స్థాపించారన్నారు. బీసీలకు రాజకీయంగా గుర్తింపు తెచ్చిన పార్టీ టీడీపీ అని ఆయన పేర్కొన్నారు. పక్కా ఇళ్ల నిర్మాణం ద్వారా పేదలకు ఇళ్లు ఇచ్చారని, ఆ పథకాలే ఇప్పుడు దేశ వ్యాప్తంగా అమలవుతున్నాయని తెలిపారు. శుభసూచికంగా ఉంటుందని పార్టీకి పసుపు రంగును ఎన్నుకున్నారని తెలిపారు.
టీడీపీ 40 వసంతాల ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్టు తెలిపారు. పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించిన ఏకైక ప్రాంతీయ పార్టీ టీడీపీ అని స్పష్టం చేశారు. జాతీయ రాజకీయాల్లో కూడా తెలుగుదేశం తనదైన ముద్ర వేసిందని పేర్కొన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున గ్రామ గ్రామాన పార్టీ ఆవిర్భావ వేడుకలు, జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు చేపట్టాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్ట్రానికి తెలుగుదేశం అవసరమేంటో ప్రజలకు వివరించాలని దిశానిర్ధేశం చేశారు.













