ఇక్కడ ఆపేసి.. అక్కడ కడతారా?
ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం నిలిపివేసి తెలంగాణలో కట్టడానికి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తహతహలాడటమేమిటని టీడీఎల్పీ సమావేశం విస్మయం వ్యక్తం చేసింది. అసెంబ్లీ సమావేశం ముగిసిన తర్వాత మంగళగిరిలో చంద్రబాబు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో మొత్తం సాగునీటి ప్రాజెక్టుల పనులు నిలిపివేశారు. తెలంగాణలో నిర్మించ తలపెట్టిన గోదావరి జలాల తరలింపులో భాగస్వాములం అవుతామని ఇక్కడి ప్రభుత్వం చెబుతోంది. ఆ రూ.50 వేల కోట్లు ఇక్కడ ఖర్చు చేస్తే ఇక్కడి ప్రాజెక్టులు పూర్తికావా? ఇక్కడి ప్రజల సొమ్ముతో ఇక్కడ సాగునీటి, మౌలిక వసతులు పెంచుకోకుండా పక్క రాష్ట్రంలో పెంచడం ఏమిటి? పొరుగు రాష్ట్ర పాలకులతో లాలూచీ పడి ఈ రాష్ట్ర సొమ్మును దుబారా చేసే హక్కు జగన్కు ఎవరిచ్చారు? దీనిని ప్రశ్నించాలి అని చంద్రబాబు అన్నారు.













