బెంగళూరుకు తారకరత్న.. కర్ణాటక సీఎంకు ఫోన్ చేసిన చంద్రబాబు
టీడీపీ యువనేత నారా లోకేష్ ప్రారంభించిన యువగళం పాదయాత్రలో పాల్గొన్న నందమూరి తారకరత్న అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు గుండెపోటు వచ్చినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ క్రమంలో ప్రస్తుతం కుప్పంలోని పీఈఎస్ ఆసుపత్రిలో తారకరత్నకు చికిత్స జరుగుతోంది. అయితే ఆయనకు మెరుగైన వైద్యం అందించడం కోసం బెంగళూరు తీసుకెళ్లాలని నిర్ణయించారు. దీని కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రి వైద్యులతో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఈ ఆసుపత్రి చైర్మన్ దేవిశెట్టికి పీఈఎస్ ఆసుపత్రి వైద్యులు పరిస్థితి వివరించారు. తారకరత్నను ఎయిర్ అంబులెన్సులో అక్కడకు తరలించడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికి అవసరమైన అనుమతులు పొందేందుకు వైద్యులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మైకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఫోన్ చేశారు. తారకరత్నను బెంగళూరు తీసుకురావడానికి, ఆసుపత్రికి తరలించేందుకు గ్రీన్ చానల్ ఏర్పాటు చేయాలని చంద్రబాబు కోరారు.













