పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో తానా పుస్తక మహోద్యమం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం, తానా మరియు తిరుపతి శ్రీ పద్మావతి విశ్వ విద్యాలయం సంయుక్త నిర్వహణలో తానా పుస్తక మహోద్యమం అట్ట హాసంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయిన తానా అధ్యక్షులు శ్రీ అంజయ్య చౌదరి లావు గారు మాట్లాడుతూ “అందమైన భాష, అమృతతుల్యం ఐన భాష తెలుగు భాష, తెలుగు సాహిత్యం విశిష్ట సంపద. అటువంటి తెలుగు భాషా సాహిత్యాల వికాసం కోసం తానా నాలుగు దశాబ్దాలుగా కృషి చేస్తుంది. ఆ దిశగానే తెలుగు పుస్తకాలను కొని, బహుమతులుగా అందించి, పుస్తకాలను చదివే సంస్కృతిని ప్రోత్సహించడానికి సాహిత్య చరిత్రలోనే అపూర్వంగా “తానా పుస్తక మహోద్యమం” అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము.
సాహిత్య వేదిక నిర్వాహకులు డాక్టర్ ప్రసాద్ తోటకూర గారు, వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ గారి సారధ్యంలో ఈ ఉద్యమం జరుగుతుంది.
విజ్ఞానం పొందడానికి, వివేకవంతులు కావటానికి , వ్యక్తిత్వం రూపుదిద్దుకోవటానికి, విజయపథంలో పయనించడానికి పుస్తక పఠనం ప్రధానం. అందుకే అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని” వారు అన్నారు.
“తెలుగు భాషా సంస్కృతులను పరిరక్షించుకోవడం కోసం, మానవ వికాసం కోసం ఉపయుక్తమయ్యే పుస్తక పఠనాన్ని ప్రోత్సహించడానికి ఈ విధంగా పుస్తక మహోత్సవాన్ని తానా నిర్వహిస్తుంది. అందరూ ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనాలి” అని విశిష్ట అతిథిగా పాల్గొన్న చిగురుమళ్ళ శ్రీనివాస్ గారు అన్నారు.
ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన విశ్వ విద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ దువ్వూరు జమున గారు మాట్లాడుతూ ” మాతృ భాషా వికాసానికి పుస్తకాలు కొని చదివే సంస్కృతిని ప్రోత్సహించటం సరైన మార్గం. పుస్తకాలు కొని చదివే వారు ఉంటేనే కవులు, రచయితలు మరింత ఉత్సాహంగా రచనలు చేయగలరని ” అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ సంఘ సేవకులు శ్రీ మోహన్ ఈదర యు. ఎస్.ఎ.గారు , రిజిస్టార్ ప్రొఫెసర్ మమత గారు, అంతర్జాతీయ సంబంధాల డీన్ ప్రొఫెసర్ పి.విజయ లక్ష్మి గారు, అంతర్జాతీయ సంబంధాల అసోసియేట్ డీన్ ప్రొఫెసర్ ద్వారం వి.జె. లక్ష్మి గారు, శ్రీ హరి, శ్రీ గిరి,శ్రీ శివ తదితరులు పాల్గొన్నారు.
తదనంతరం తెలుగు పుస్తకాలను విద్యార్థినులకు అతిథులు బహుమతులు గా అందజేశారు.













