సేవే తన అభిమతం.. సేవా గుణమే నిజమైన మతం – ఎం. వెంకయ్యనాయుడు
శ్రీ ఘనంగా స్వర్ణభారత్ ట్రస్ట్ 20వ వార్షికోత్సవాలు
సేవే తన అభిమతమని, సేవే అసలైన మతమని ప్రగాఢంగా విశ్వసిస్తానని మన సంస్కృతి, సంప్రదాయాలను యువత కాపాడుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలంలో స్వర్ణభారత్ ట్రస్టు 20వ వార్షికోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతోపాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తదితరులు హాజరై ట్రస్ట్ సేవలను కొనియాడారు. యువతకు దిశానిర్దేశం చేశారు. వెంకయ్యనాయుడు చేతుల మీదుగా వెంకటాచలంలో ప్రారంభమైన స్వర్ణభారత్ ట్రస్ట్ కార్యకలాపాలను ప్రస్తుతం ఆయన కుమార్తె దీపా వెంకట్ చూస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వెంకయ్యనాయుడు మాట్లాడారు. మాతృభాషను, మాతృభూమిని ఏనాడూ మరువొద్దని, తెలుగు భాష పరిరక్షణ కోసం స్వర్ణభారత్ ట్రస్టు ప్రయత్నిస్తున్నదని చెప్పారు. సేవా సంస్థలను ప్రోత్సహిస్తారనే నమ్మకంతోనే పలువురిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించినట్లు తెలిపారు.
దేవాలయానికి వెళ్తే ఎంత పుణ్యం వస్తుందో.. అంతే పుణ్యం సేవాలయానికి వెళ్తే దొరుకుతుందన్నారు. గ్రామీణ యువతే దేశానికి ఆశాకిరణాలని చెప్పిన ఆయన.. యువతకు శిక్షణ ఇచ్చి సొంతకాళ్లపై నిలబడేలా చేయాలని సూచించారు. గ్రామీణ మహిళలు, దివ్యాంగుల్లోని ప్రతిభను గుర్తించి వారికి శిక్షణ ఇస్తుండటం అభినందనీయమని ఉపరాష్ట్రపతి తెలిపారు. కూడబెట్టిన ఆస్తుల వల్ల కలిగే తృప్తికన్నా సేవా కార్యక్రమాల ద్వారా కలిగే సంత ృప్తి వెలకట్టలేనిదన్నారు. ఆ ఉద్దేశంతోనే స్వర్ణ భారత్ ట్రస్ట్ ద్వారా అన్ని వర్గాల ప్రజలకు సేవ చేస్తున్నట్లు చెప్పారు. ఇక్కడ జరుగుతున్న సేవా కార్యక్రమాలను చూసి స్ఫూర్తి పొంది తమ ప్రాంతాల్లో యువతను ఇలాంటి సేవ కార్యక్రమాలకు ప్రోత్సహించాలని, తద్వారా యావత్ దేశం స్వర్ణ భారత్‌గా తయారు కావాలనే తలంపుతోనే ట్రస్ట్ వార్షికోత్సవ కార్యక్రమాలకు దేశంలోని ప్రముఖులను ఆహ్వానిస్తున్నామని తెలిపారు.
తల్లిదండ్రులు పిల్లలకు ఆస్తులను వారసత్వంగా అందించడానికే పరిమితం కాకుండా సేవా భావాన్ని కూడా వారసత్వంగా అందివ్వాలని పిలుపునిచ్చారు. పెద్దలు ఇచ్చిన సేవాభావాన్ని ముందుకు కొనసాగించడమే నిజమైన వారసత్వం అవుతుందన్నారు. తాను ఏ పదవిలో ఉన్నా, లేకున్నా జనం వద్దకు వచ్చి సేవ చేస్తూనే ఉంటానన్నారు. పల్లెలు,పట్టణాల మధ్య అంతరాలు తగ్గాలని, రైతులు, వ్యవసాయ రంగం బాగుంటేనే దేశం బాగుంటుందన్నారు. ఆ ఉద్దేశంతోనే స్వర్ణ భారత్ ట్రస్ట్ రైతు సేవ చేస్తోందన్నారు. సమాజంలో సగమైన మహిళలకు చదువు, ఆస్తిలో సమాన హక్కు, గౌరవం లభించినప్పుడే దేశం ప్రగతి పథంలో నడుస్తుందన్నారు. గ్రామీణ మహిళలను స్వశక్తి మీద నిలబడేలా స్వర్ణ భారత్ ట్రస్ట్ శిక్షణ ఇస్తోందన్నారు. తనను, తన కుటుంబాన్ని తల్లిలా ఆదరించి, తమను సంస్కరించిన తన అత్త కౌసల్యమ్మ పేరు మీద ట్రస్ట్ ఆవరణలో ఒక భవనం నిర్మించి, దానిని ఓకేషనల్ కోర్సులకు కేటాయించడం ఆనందంగా ఉందన్నారు.
ఉప రాష్ట్రపతి పదవిలో ఉన్నా ఒక చిన్న గ్రామంలో స్థాపించిన స్వర్ణ భారత్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలను క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తున్న వెంకయ్య నాయుడు మహనీయుడని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కొనియాడారు. రాజకీయాలలోనే గాక సామాజిక సేవా పరంగా కూడా వెంకయ్య ఆదర్శనీయుడన్నారు. ఎంత ఎదిగినా మన మూలాలు మర్చిపోరాదని, వెంకయ్య ఎప్పుడూ మాతృభూమిని మర్చిపోలేదని చెప్పారు. ‘‘ట్రస్ట్ గురించి కంటే ముందు వెంకయ్య నాయుడు గురించి మాట్లాడాలి. వెంకయ్య స్వస్థలంలో ఆయన రాజకీయ, సేవ కార్యక్రమాల గురించి మాట్లాడే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నా. స్వర్ణ భారత్ ట్రస్ట్ ఏర్పాటు చేయాలన్నది గొప్ప ఆలోచన. కేంద్ర మంత్రి నుంచి ఉప రాష్ట్రపతి వరకు ఎన్నో పదవులకు ఆయన వన్నె తెచ్చారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా సేవ చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఎంతో కృషి చేశారు. ఆర్టికల్ 370 రద్దు బిల్లు ఆమోదంలో ఉప రాష్ట్రపతిగా ముఖ్య భూమిక పోషించారు. నేను బీజేపీ కార్యకర్తగా ఉన్నప్పుడే ఆయన పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఎంతో క్రమశిక్షణతో పార్టీని నడిపించారు’’ అని అమిత్ షా అన్నారు.
ట్రస్ట్ సావనీర్‌ను వెంకయ్య నాయుడు, అమిత్ షా ఆవిష్కరించారు. ట్రస్ట్ చైర్మన్ కామినేని శ్రీనివాస్, ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ దీపా వెంకట్ అతిథులకు స్వాగతం పలికారు.
వెంకయ్య మనవరాలు 50 లక్షల విరాళం ఉప రాష్ట్రపతి మనవరాలు నిహారిక డిసెంబరులో జరిగే తన వివాహాన్ని పురస్కరించుకొని కాబోయే భర్తతో కలిసి రూ.50లక్షల విరాళాన్ని హ ృదయ క్యూర్ ఏ లిటిల్‌హార్ట్ ఫౌండేషన్ కోసం స్వర్ణ భారత్ ట్రస్ట్‌కు అందజేశారు. ఈ విరాళాన్ని నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో గుండె జబ్బులతో బాధపడుతున్న చిన్నారుల చికిత్స కోసం వినియోగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి లక్ష్మీనారాయణ, సోము వీర్రాజు, ముప్పవరపు ఫౌండేషన్ ట్రస్టీ ముప్పవరపు హర్షవర్ధన్ పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.













