Devineni Avinash: పెనమలూరు టికెట్‌పై ఉత్కంఠ… అవినాష్ కోరిక జగన్ ఒప్పుకుంటారా?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party)లో ఈ మధ్య జరుగుతున్న అంతర్గత చర్చల్లో దేవినేని అవినాష్ (Devineni Avinash) పేరు మళ్లీ కేంద్రంగా మారింది. విజయవాడ (Vijayawada)కు చెందిన సీనియర్ నేత దేవినేని నెహ్రూ (Devineni Nehru) వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన అవినాష్‌కు ఇప్పటివరకు ఆశించిన స్థాయి విజయం దక్కలేదు. కొత్త సంవత్సరం వచ్చిన ఈ వేళ అయినా పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Y.S. Jagan Mohan Reddy) నుంచి సానుకూల స్పందన వస్తుందా అన్నది వైసీపీలో ఆసక్తికర చర్చగా మారింది.
అవినాష్ రాజకీయ ప్రయాణాన్ని పరిశీలిస్తే, పోటీలు ఎక్కువగా ఉన్నా గెలుపు మాత్రం అందని ద్రాక్షలా మారిందన్న మాట వినిపిస్తుంది. 2014లో కాంగ్రెస్ పార్టీ (Congress) తరఫున విజయవాడ ఎంపీ స్థానానికి పోటీ చేసి ఓటమిని ఎదుర్కొన్నారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో గుడివాడ (Gudivada) నుంచి తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) తరఫున బరిలోకి దిగినా ఫలితం అనుకూలంగా రాలేదు. 2024లో వైసీపీ (YCP) తరఫున విజయవాడ తూర్పు నియోజకవర్గం (Vijayawada East) నుంచి పోటీ చేసినప్పటికీ గెలుపు దక్కలేదు. ఇలా వరుస ఓటములు అవినాష్ రాజకీయ భవిష్యత్తుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
ప్రస్తుతం ఆయన విజయవాడ వైసీపీ ఇంచార్జ్‌గా ఉన్నప్పటికీ, మనసంతా పెనమలూరు (Penamaluru) నియోజకవర్గంపైనే ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనికి కారణం అక్కడ దేవినేని నెహ్రూకు ఒకప్పుడు ఉన్న బలమైన సామాజిక వర్గ మద్దతు. గతంలో కంకిపాడు (Kankipadu) నియోజకవర్గ పరిధిలో భాగంగా ఉన్న ఈ ప్రాంతంలో కమ్మ సామాజిక వర్గం ప్రభావం ఎక్కువగా ఉండటం అవినాష్‌కు కలిసి వచ్చే అంశంగా ఆయన భావిస్తున్నారు. అందుకే వచ్చే 2029 ఎన్నికల నాటికి అయినా అక్కడి నుంచి పోటీ చేసి గెలవాలన్న ఆశతో పార్టీ అధినేతను ఇప్పటికే రెండు సార్లు కలిసి తన కోరికను వెల్లడించినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా, పెనమలూరులో గత ఎన్నికల వరకు ఉన్న కొలుసు పార్థసారథి (Kolusu Parthasarathi) పార్టీ మారడంతో పరిస్థితి మారింది. ఆయన స్థానంలో జోగిరమేష్ (Jogiraju Ramesh)ను తీసుకువచ్చినా, ఆయన ఓడిపోవడం, అనంతరం మైలవరం (Mylavaram) తన సొంత నియోజకవర్గమంటూ అక్కడికి వెళ్లిపోవడంతో పెనమలూరు ప్రస్తుతం ఖాళీగా ఉన్నట్టే కనిపిస్తోంది. ఈ అవకాశాన్ని తనకు ఇవ్వాలని అవినాష్ కోరుతున్నా, పార్టీ నుంచి స్పష్టమైన సంకేతాలు రావడం లేదన్న అసంతృప్తి వ్యక్తమవుతోంది.
మరోవైపు పార్టీ అధిష్టానం విజయవాడ ఎంపీ స్థానం మీద దృష్టి పెట్టిందన్న చర్చ సాగుతోంది. అక్కడ గెలుపు బాధ్యతను పార్టీ తీసుకుంటుందని సంకేతాలు ఉన్నా, అవినాష్ మాత్రం ఎంపీగా పోటీ చేయాలనే ఆలోచన లేదని స్పష్టం చేస్తున్నారని అంటున్నారు. ఈ భిన్నాభిప్రాయాల మధ్య అవినాష్ ,పార్టీ నాయకత్వం మధ్య కోల్డ్ వార్ నడుస్తోందన్న మాట వైసీపీ వర్గాల్లో వినిపిస్తోంది. వచ్చే రోజుల్లో ఈ వ్యవహారం ఎటు దారి తీస్తుందో అన్నది రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.






