కరోనా మృతుల విషయంలో ఏపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు సీరియస్
ప్రపంచంలో కరోనా మహమ్మారి ఎంత విలయం సృష్టించిందో అందరికీ తెలిసిందే. అగ్రరాజ్యం అమెరికా కూడా ఈ వైరస్ దెబ్బకు వణికిపోయింది. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్లో కూడా కరోనా మృత్యుఘంటికలు మోగాయి. ఈ మహమ్మారి కారణంగా ఏపీలో 14 వేల మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఈ క్రమంలో చాలా మంది చిన్నారులు కూడా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారారు. ఇలా కష్టాల్లో ఉన్న కరోనా మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఎలాంటి నష్టపరిహారం ఇవ్వడం లేదని పల్లా శ్రీనివాస రావు అనే వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం ఏపీ సర్కారుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. కరోనా కారణంగా మరణించిన వారి కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇలా నష్టం అందజేయని అంశాన్ని పరిశీలించాలని ఏపీ రాష్ట్ర లీగల్ ఎయిడ్ సర్వీసెస్ అథారిటీని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.













