SriLakshmi: శ్రీలక్ష్మిని వెంటాడుతున్న ఓఎంసీ కేసు.. సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ..!!

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (OMC) వ్యవహారంలో అక్రమాలకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి (Srilakshmi) సుప్రీంకోర్టులో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. గతంలో తెలంగాణ హైకోర్టు శ్రీలక్ష్మిపై అభియోగాలను కొట్టsసి ఆమెకు క్లీన్‌చిట్ ఇచ్చింది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ సీబీఐ (CBI) సుప్రీంకోర్టును (Supreme Court) ఆశ్రయించింది. ఈ కేసుపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. తెలంగాణ హైకోర్టు (Telangana High Court) ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ, శ్రీలక్ష్మి పాత్రపై మరోసారి విచారణ జరపాలని ఆదేశించింది. మూడు నెలల్లో విచారణ పూర్తి చేయాలని హైకోర్టుకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో శ్రీలక్ష్మికి గట్టి ఎదురుదెబ్బ తగలినట్లయింది.
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ఓబుళాపురం మైనింగ్ కంపెనీ నిర్వహించిన గనుల తవ్వకాల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. అక్రమ తవ్వకాలు, రవాణా, ఎగుమతులు, విక్రయాల్లో అవినీతి జరిగిందని సీబీఐ దర్యాప్తు చేపట్టింది. ఈ కేసులో మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి (Gali Janardhan Reddy), ఆయన సోదరుడు బీవీ శ్రీనివాస్ రెడ్డితో పాటు పలువురు వ్యాపారవేత్తలు, అధికారులు ఆరోపణలు ఎదుర్కొన్నారు. శ్రీలక్ష్మి ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కీలక వ్యక్తుల్లో ఒకరు. ఆమె నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గనుల శాఖలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. గనుల కేటాయింపు, అనుమతుల్లో ఆమె పాత్రపై సీబీఐ సందేహాలు వ్యక్తం చేసింది.
రెండ్రోజుల కిందట నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు ఓఎంసీ కేసులో తీర్పు వెలువరించింది. ఈ కేసులో గాలి జనార్ధన్ రెడ్డి, బీవీ శ్రీనివాస్ రెడ్డి, వీడీ రాజగోపాల్, ఓబుళాపురం మైనింగ్ కంపెనీ, అలీ ఖాన్‌లకు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. మరో ఇద్దరిని నిర్దోషులుగా ప్రకటించగా, ఒక వ్యక్తి ఈ కేసు విచారణ సమయంలో మరణించారు. ఈ తీర్పు రాష్ట్రంలో రాజకీయంగా సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో శ్రీలక్ష్మి పాత్రపై మళ్లీ పునర్విచారణకు సుప్రీంకోర్టు ఆదేశించడం సంచలనం కలిగిస్తోంది.
తెలంగాణ హైకోర్టు 2023లో శ్రీలక్ష్మిపై కేసును కొట్టివేసింది. ఆమెపై అభియోగాలకు తగిన ఆధారాలు లేవని, ఆమె నిర్దోషి అని పేర్కొంది. అయితే, సీబీఐ ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సీబీఐ వాదనలను విన్న సుప్రీంకోర్టు, శ్రీలక్ష్మి పాత్రపై మరింత లోతైన విచారణ అవసరమని భావించింది. హైకోర్టు తీర్పును పూర్తిగా పక్కనపెట్టిన సుప్రీంకోర్టు, మూడు నెలల్లో కేసు విచారణ పూర్తి చేయాలని ఆదేశించింది. ఒకవేళ హైకోర్టు విచారణలో శ్రీలక్ష్మి దోషిగా తేలితే, ఆమెకు శిక్ష పడడం ఖాయంగా కనిపిస్తోంది. ఇది ఆమె కెరీర్ పైన తీవ్ర ప్రభావం చూపించడం ఖాయం.