Kommineni: కొమ్మినేనికి సుప్రీంకోర్టులో భారీ ఊరట.. వెంటనే విడుదలకు ఆదేశం

ఆంధ్రప్రదేశ్‌లో సీనియర్ జర్నలిస్ట్, సాక్షి టీవీ వ్యాఖ్యాత కొమ్మినేని శ్రీనివాసరావు (Kommineni srinivasa Rao) అరెస్టు వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో, సుప్రీంకోర్టు (Supreme Court) శుక్రవారం ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ కీలక తీర్పు వెలువరించింది. కొమ్మినేనిని వెంటనే విడుదల చేయాలని ఆదేశిస్తూ, వాక్ స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పింది. ఈ తీర్పు రాజకీయ, మీడియా వర్గాల్లో సంచలనం సృష్టించింది.
కొమ్మినేని శ్రీనివాసరావున జూన్ 9న హైదరాబాద్‌లోని జర్నలిస్ట్ కాలనీలోని తన నివాసంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సాక్షి టీవీలో (Sakshi TV) ఆయన నిర్వహించిన చర్చా కార్యక్రమంలో అమరావతి మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు రావడంతో గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ చర్చలో జర్నలిస్ట్ కృష్ణంరాజు “అమరావతి దేవతల రాజధాని కాదు, వేశ్యల రాజధాని” అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొమ్మినేని వాటిని ఖండించకపోగా, ప్రోత్సహించినట్లు ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఆరోపణలతో కొమ్మినేనితో పాటు కృష్ణంరాజు, సాక్షి యాజమాన్యంపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం సహా బీఎన్‌ఎస్, ఐటీ యాక్ట్ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.
అరెస్టు తర్వాత కొమ్మినేనిని విజయవాడకు, అనంతరం మంగళగిరి కోర్టుకు తరలించారు. ఆయన అరెస్టును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ జరిపింది. కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలతో కొమ్మినేనికి ప్రత్యక్ష సంబంధం లేదని, చర్చా కార్యక్రమ నిర్వాహకుడిగా ఆయన బాధ్యత విశ్లేషకుల వ్యాఖ్యలకు పరిమితం కాదని కోర్టు అభిప్రాయపడింది. “నవ్వినంత మాత్రాన అరెస్టు చేస్తారా? కేసుల విచారణ సందర్భంగా మేము కూడా నవ్వుతుంటాం” అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ సందర్భంలో అరెస్టు చట్టవిరుద్ధమని తేల్చింది.
సుప్రీంకోర్టు తన తీర్పులో కొమ్మినేని వయస్సు (70 ఏళ్లు)ను కూడా పరిగణనలోకి తీసుకుంది. “70 ఏళ్ల వ్యక్తిని, అది కూడా డిబేట్ నిర్వహించినందుకు ఎలా అరెస్టు చేస్తారు?” అని ప్రశ్నించింది. మూడేళ్ల కంటే తక్కువ శిక్ష విధించే కేసుల్లో ముందస్తు నోటీసు ఇవ్వకుండా అరెస్టు చేయడం సీఆర్‌పీసీ సెక్షన్ 41కి విరుద్ధమని స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతం కాకుండా జాగ్రత్త వహించాలని కొమ్మినేనిని హెచ్చరించిన కోర్టు, విడుదలకు సంబంధించిన షరతులను సంబంధిత ట్రయల్ కోర్టు నిర్ణయిస్తుందని తెలిపింది.
ఈ తీర్పుపై వైఎస్సార్‌సీపీ నాయకులు, సాక్షి మీడియా సంతోషం వ్యక్తం చేశారు. “చంద్రబాబు నిరంకుశ పాలనకు సుప్రీంకోర్టు చెంపపెట్టు” అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ఈ అరెస్టు వాక్ స్వాతంత్ర్యానికి భంగం కలిగించిందని, ప్రజాస్వామ్య విలువలను కాపాడే దిశగా సుప్రీంకోర్టు తీర్పు ఉందని YSRCP అధికార ప్రతినిధులు పేర్కొన్నారు. కొమ్మినేని విడుదల తర్వాత కేసు ఏ దిశగా సాగుతుందనేది ట్రయల్ కోర్టు నిర్ణయంపై ఆధారపడి ఉంది.