వివేక హత్య కేసులో నిందితుడు శివశంకర్ రెడ్డికి … సుప్రీంకోర్టు నోటీసులు
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో నిందితుడు శివశంకర్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. జులై 22 నుంచి ప్రారంభమయ్యే వారంలో లిస్ట్ చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. శివశంకర్ రెడ్డికి ఇటీవల తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణలో భాగంగా శివశంకర్ రెడ్డి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్పై సమాధానం చెప్పాలని కోరింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో శివశంకర్ రెడ్డి ఏ5గా ఉన్నారు. ఆయనతో పాటు ప్రతివాదులందరికీ అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ప్రతివాదిగా దర్యాప్తు సంస్థ సీబీఐని కూడా సునీత చేర్చారు.
వాదనల సమయంలో విచారణ ఏ దశలో ఉందని ధర్మాసనం ప్రశ్నించింది. ఛార్జెస్ ప్రేమ్ చేసే దశలోనే ఉన్నట్లు సునీత తరపు న్యాయవాది బదులిచ్చారు. ప్రతి దశలోనూ ట్రయల్ సాగుకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని తెలిపారు. ఈ కేసులో ఇతర నిందితులు కూడా బెయిల్ పొందారా అని ధర్మాసనం ప్రశ్నించింది. ఏ1కు గతంలో బెయిల్ రాగా, సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందని న్యాయవాది తెలిపారు. ఇదే కేసుకు సంబంధించి గతంలో దాఖలైన పలు పిటిషన్లపై విచారణ జరగాల్సి ఉందని చెప్పారు. ఈ నెల మూడో వారంలో ఇదే ధర్మాసనం ముందుకు వస్తుందని చెప్పారు. ఏ8 మాత్రం ముందస్తు బెయిల్పై ఉన్నారని, దీనిపై ఇప్పటికే సవాల్ చేసినట్లు తెలిపారు.













