అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై… విచారణ మరోసారి వాయిదా
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది. ఏప్రిల్ మూడో వారంలో కేసు తుది వాదనలు వింటామని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం వెల్లడించింది. ఏప్రిల్ 22కి ముందు కేసు విచారణకు తీసుకునే పరిస్థితి లేదని స్పష్టం చేసింది. ఈలోపు కేసు డైరీ మొత్తాన్ని కోర్టు ముందు ఉంచాలని ఆదేశించగా అది 60 భాగాలుగా ఉందని సీబీఐ తరపు న్యాయవాది తెలిపారు. అయితే, వాటిని డిజిటల్ రూపంలోకి మార్చి ఈ-డైరీ సమర్పించాలని ఆదేశించింది. అవినాష్‌రెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.













