సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్ కు రఘు రామకృష్ణ రాజు

నర్సారుపం ఎంపీ రఘురామకృష్ణరాజుకు సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీన్ని జ్యుడిషియల్ కస్టడీగా భావించాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. వైద్య పరీక్షల పర్యవేక్షణకు న్యాయాధికారిని తెలంగాణ హైకోర్టు నియమించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వైద్య పరీక్షలను వీడియో తీయాలని, నివేదికను సీల్డ్ కవర్‍లో అందించాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ ఆదేశాలు అమలయ్యేలా ఏపీ సీఎస్ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. తదుపరి ఆదేశాల వరకు రఘురామను ఆర్మీ ఆస్పత్రిలోనే ఉంచాలని సూచించింది. అనంతరం తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది.
రఘురామకృష్ణరాజు బెయిల్ పిటిషన్‍తో పాటు ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్య పరీక్షల అంశంపై సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. రఘురామ తరపున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, ఆదినారాయణరావు, ఆంధప్రదేశ్ ప్రభుత్వం తరపున దుష్యంత్ దవే, వీవీ గిరి వాదనలు వినిపించారు. ప్రైవేట్ ఆస్పత్రిలో కూడా వైద్య పరీక్షలు చేయించాలని కింది కోర్టు ఆదేశించినా అధికారులు ఆ పనిచేయలేదని ముకుల్ రోహత్గీ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కస్టడీలో రఘురామను తీవ్రంగా కొట్టి హింసించారని, అరికాళ్లకు తగిన గాయలను ఎంపీ మెజిస్ట్రేట్‍కు చూపించారని తెలిపారు. బెయిల్ మంజూరుతో పాటు ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం అందించేందుకు అవకాశం కల్పించాలని రోహత్గీ కోర్టును కోరారు. రఘురామ వైద్య పరీక్షలకు విజయవాడ మణిపాల్ ఆస్పత్రి ఉందని, కేవలం వైద్య పరీలకు మాత్రమే అనుమతివ్వాలని, ఆస్పత్రిలో అడ్మిషన్‍కు అవకాశం ఇవ్వొదని రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది దుష్యంత్ దవే కోరారు. ఈ రోజు రఘురామకృష్ణరాజును సికింద్రాబాద్ లోని ఆర్మీ ఆసుపత్రికి తరలించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. సుప్రీం ఆదేశాలతో రఘురామకృష్ణరాజును ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది.