పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సుప్రీం ఓకె… ప్రభుత్వం, ఉద్యోగుల పిటీషన్ కొట్టివేత
ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సుప్రీంకోర్డు స్పష్టమైన తీర్పును ఇవ్వడంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యోగులు దాఖలు చేసిన పిటీషన్ను కొట్టివేసింది. దీంతో ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఉన్న సస్పెన్స్ వీడింది. రాష్ట్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య కొనసాగుతున్న వివాదానికి సుప్రీం కోర్టు ముగింపు పలికింది. ఏపీలో ఇప్పటికే విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారమే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని పిటిషన్ల విచారణ చేపట్టిన జస్టిస్ సంజయ్ కౌల్, జస్టిస్ హషికేశ్ రాయ్ ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ పిటిషన్లపై విచారణ సందర్భంగా ఉద్యోగ సంఘాలపై జస్టిస్ కౌల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగ సంఘాల వ్యవవహార శైలి చట్ట విరుద్ధంగా ఉందని, తమ విధులు నిర్వహించకుండా సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం ప్రమాదకరమైన ధోరణికి సంకేతమని జస్టిస్ కౌల్ అభిప్రాయపడ్డారు.
ఉద్యోగుల ప్రవర్తన పూర్తి అసంతృప్తిగా ఉందని, దేశంలో ఎక్కడా ఎన్నికలు జరగట్లేదా? అని జస్టిస్ కౌల్ ప్రశ్నించారు. ఎక్కడైనా ఎన్నికలు రాజ్యాంగ ప్రక్రియలో భాగమని, కరోనా వ్యాప్తి చెందుతున్న తొలినాళ్లలో ఎన్నికలు కావాలని చెప్పిన విషయాన్ని జస్టిస్ కౌల్ గుర్తు చేశారు. ఎస్ఈసీని తప్పుబడుతూ దురుద్దేశాలు ఆపాదిస్తున్నారని, ఎన్నికల నిర్వహణ అంశం తెరపైకి వచ్చిన ప్రతీసారి వాయిదా కోసం కోర్టుకు వస్తున్నారని జస్టిస్ కౌల్ పేర్కొన్నారు. జస్టిస్ సంజయ్ కిషన్ మొదటి నుంచి ప్రభుత్వ వాదనలతో విభేదించారు. ప్రభుత్వం తరపున వాదించిన ముకుల్ రోహత్గీ కూడా పిటీషన్ లో ఎస్ఈసీ దురుద్దేశపూరితంగా వ్యవహరిస్తున్నారన్న వ్యాఖ్యలతో ఏకీభవించటం లేదని వ్యాఖ్యానించాల్సి వచ్చింది. రాజ్యాంగ సంస్థలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయటం ఏ మాత్రం సరికాదని కోర్టు అభిప్రాయపడింది. గోవా సహా పలు రాష్ట్రాల్లో స్థానిక ఎన్నికలు వాయిదా పడ్డాయని,,కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కోసం వాయిదా వేశారని ఏపీ ప్రభుత్వం తరపున వాదించిన ముకుల్ రోహత్గీ కోర్టుకు నివేదించారు. కాని సుప్రీంకోర్టు ఎన్నికల నిర్వహణకు తాము అడ్డుపడటం లేదని తేల్చి చెప్పింది.













