గిరిజన పద్ధతిలో పెళ్లి చేసుకున్న సుప్రీం కోర్టు న్యాయమూర్తి..
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి దంపతులు అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు పర్యటించారు. ఈ సందర్భంగా మరొకసారి గిరిజన ఆచార సాంప్రదాయాలను పాటిస్తూ ఈ జంట వివాహం చేసుకున్నారు. ఆదివాసీల సాంప్రదాయం ప్రకారం స్థానిక గిరిజనులు, అధికారులు, బంధుమిత్రుల సమక్షంలో జేకే మహేశ్వరి దంపతులు పెళ్లి చేసుకున్నారు. గిరిజన పెద్దల చేతుల మీదగా జరిగిన ఈ పెళ్లికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఏజెన్సీ ప్రాంతాన్ని సందర్శించడానికి శనివారం నాడు కుటుంబంతో కలిసి విశాఖపట్నం నుంచి అరకు లోయకు చేరుకున్న జస్టిస్ మహేశ్వరికి అధికారులు ఘన స్వాగతం పలికారు. అరకు లోయలోని గిరిజన మ్యూజియం, కళా గ్రామం సందర్శించిన తర్వాత పెదలబుడు పంచాయతీలోని గిరి గ్రామదర్శినిని జస్టిస్ మహేశ్వరి సందర్శించారు. గిరిజన సంప్రదాయం ఉట్టిపడేలాంటి వస్త్రాలను ధరించిన జస్టిస్ మహేశ్వరి దంపతులు అక్కడే పెళ్లి చేసుకున్నారు.
ఈ పెళ్లి వేడుకల అనంతరం ధింసా కళాకారులు కలిసి నృత్యం చేశారు. ఈ సందర్భంగా జస్టిస్ జేకే మహేశ్వరి మాట్లాడుతూ.. అరకు లోయలోని ప్రకృతి సోయగాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయని.. ఇక్కడ గిరిజన సంప్రదాయాలు వెనుక ఎంతో అర్థం ఉందని ప్రశంసించారు. ఇలా తిరిగి గిరిజన సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోవడం తనకు ఒక కొత్త అనుభూతిని మిగిల్చిందని ఆయన పేర్కొన్నారు. జస్టిస్ జేకే మహేశ్వరి తో పాటుగా విశాఖ జిల్లా కోర్టు ప్రిన్సిపల్ జడ్జ్ అలపాటి గిరిధర్, పోక్సో కోర్టు జడ్జి ఆనంది, అదనపు జిల్లా జడ్జి గోవర్ధన్, గాజువాక సీనియర్ సివిల్ జడ్జి రాజేంద్రబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒక సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఇలా తమ సంప్రదాయాలకు గౌరవం ఇవ్వడంతో పాటు తమతో ఓ మామూలు వ్యక్తిగా కలిసి మెలగడంపై గిరిజనులు హర్షం వ్యక్తం చేశారు.













