Supreme Court : ఇలాంటి పిటిషన్లను కూడా మీరు వాదిస్తారా? : సుప్రీంకోర్టు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఉన్న సీఐడీ(CID) కేసులను సీబీఐ (CBI) కి బదిలీ చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు (Supreme Court) కొట్టివేసింది. ఏడు కేసులు సీబీఐకి బదిలీ చేయాలంటూ హైకోర్టు న్యాయవాది బి.బాలయ్య( Balayya) ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఇది పూర్తిస్థాయిలో తప్పుడు పిటిషన్ అని జస్టిస్ బేలా త్రివేది (Bela Trivedi) నేతృత్వంలోని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషన్‌కు సంబంధించి ఒక్క మాట మాట్లాడినా భారీగా జరిమానా విధిస్తామని జస్టిస్ బేలా త్రివేది హెచ్చరించారు. బాలయ్య తరపున వాదనలు వినిపించడానికి సీనియర్ న్యాయవాది మణీందర్ సింగ్ సిద్ధమవగా, ఇలాంటి పిటిషన్లను కూడా మీరు వాదిస్తారా? అని ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇలాంటి కేసులో కూడా మీలాంటి సీనియర్లు హాజరవుతారని అసలు ఊహించలేదని వ్యాఖ్యానించింది. ఒక్క మాట కూడా మాట్లాడొద్దంటూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మస్ చేసింది.













