ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురు
రాజధాని అమరావతి కి సంబంధించిన కేసుల అంశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. విచారణ త్వరగా పూర్తిచేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాదులు మరోసారి విజ్ఞప్తిని జస్టిస్ కేఎం జోసెఫ్ ధర్మాసనం తోసిపుచ్చింది. ఇది వరకు పేర్కొన్నట్లుగా మార్చి 28నే విచారణ చేపడతామని తేల్చి చెప్పింది. 28వ తేదీ ఒక్కటే సరిపోదని, మార్చి 29, 30న కూడా విచారించాలని ఏపీ ప్రభుత్వ న్యాయవాదులు కోరారు. మార్చి 29, 30 తేదీలు బుధ, గురువారాలని, నోటీసులు ఇచ్చిన కేసులను ఆ తేదీల్లో విచారణ జరపరాదని ధర్మాసనం తెలిపింది. దీనిపై సీజేఐ సర్క్యులర్ ఉందని గుర్తు చేసింది. ఆ రెండు రోజుల్లో విచారణ తన చేతుల్లో లేదని, ఆ విషయంలో సీజేఐ మాత్రమే నిర్ణయం తీసుకుంటారని జస్టిస్ కేఎం జోసెఫ్ తెలిపారు. అమరావతి రాజధాని కేసు చాలా పెద్దదని, అన్ని అంశాలూ పరిశీలించి తీర్పు ఇవ్వాల్సి ఉంటుందని ఈ సందర్భంగా జస్టిస్ కేఎం జోసెఫ్ అన్నారు. అలా చేస్తేనే సార్థకత ఉంటుందని తెలిపారు. దీనిలో రాజ్యాంగపరమైన అంశాలు చాలా ఇమిడి ఉన్నాయన్నారు. అంతకుమించి ఈ కేసులో ఇంకేమి వ్యాఖ్యానించలేనని తెలిపారు. తమ విజ్ఞప్తిని సీజేఐ ముందు ప్రత్యేకంగా ప్రస్తావించేందుకు అనుమతివ్వాలని ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాదులు కోరగా ధర్మాసనం నిరాకరించింది.













