YS Avinash Reddy: అవినాష్ బెయిల్ రద్దు పిటిషన్ పై సుప్రీమ్ కోర్టు కీలక వ్యాఖ్యలు..

ఆంధ్రప్రదేశ్‌లో మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి (Y. S. Vivekananda Reddy) హత్య కేసు మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా చెప్పబడుతున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి (Y. S. Avinash Reddy) బెయిల్ రద్దుకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.
విచారణలో భాగంగా సుప్రీంకోర్టు (Supreme Court) సీబీఐ దర్యాప్తుపై ఆసక్తికర ప్రశ్నలు ఉద్ఘాటించింది. అవినాష్ రెడ్డికి బెయిల్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కేంద్ర దర్యాప్తు సంస్థతో పాటు వైఎస్ సునీతా రెడ్డి (Y. S. Sunitha Reddy) కూడా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లు జస్టిస్ ఎం.ఎం. సుందరేష్ (Justice M. M. Sundresh) ఆధ్వర్యంలో విచారణకు వచ్చాయి.
వివేకా హత్య కేసులో ఇంకా విచారణ అవసరమా లేదా? ఇప్పటికే ప్రభుత్వం సమర్పించిన క్లోజర్ రిపోర్టుపై సీబీఐ అభిప్రాయం ఏమిటి? కేసు విచారణ కొనసాగుతున్న సమయంలోనే సీబీఐ మరోసారి దర్యాప్తు కొనసాగించగలదా లేదా? అనే మూడు కీలక ప్రశ్నలు సుప్రీంకోర్టు సీబీఐ (CBI) కి సంధించింది. ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తర్వాతే అవినాష్ రెడ్డి బెయిల్ రద్దుపై తాము నిర్ణయం తీసుకుంటామని ధర్మాసనం వెల్లడించింది.
ఇదే సమయంలో సునీత తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా (Siddharth Luthra) – ప్రస్తుతం బెయిల్ పై ఉన్న నిందితులు మౌలిక సాక్ష్యాలను ప్రభావితం చేస్తున్నారని, కేసులో న్యాయపరమైన నిజానిజాలు వెలుగులోకి రావడం ఆపబడుతున్నదని వాదించారు. ఈ విషయాన్ని కూడా సుప్రీం కోర్టు గమనించనుంది.
ఇప్పటికే తెలంగాణ హైకోర్టు (Telangana High Court) బెయిల్ మంజూరు చేసినా..ఇప్పుడు సుప్రీం ముందు అసలు విషయాలపై తేల్చే అవకాశముంది.ఈ విచారణ ఫలితాలపై ఇప్పుడు సర్వత్ర తీవ్ర ఆసక్తి నెలకొంది. మరోపక్క ఈ కేసు లో సీబీఐ సమర్పించబోయే సమాధానాలే ఈ కేసు దిశను నిర్దేశించబోతుంది. ఇప్పటికే లిక్కర్ స్కాం కేసు విషయంలో ఎందరో వైసీపీ నేతలు అరెస్ట్ అయిన నేపథ్యంలో అవినాష్ రెడ్డి పై కోర్టు ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అన్నది ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది.