Super six: నీరు గారుతున్న కూటమి హామీలు.. ఇకనైనా మేలుకోకపోతే కష్టమే!
ఎన్నికలకు ముందు ప్రజల్లో నమ్మకాన్ని పెంచుకొని గెలవడం కోసం కూటమిలో భాగమైన టీడీపీ (TDP) , జనసేన( janasena) , బీజేపీ (BJP) పార్టీలు ప్రజల ముందు ఎన్నో హామీలను ఉంచారు. అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టే విధానం మాత్రం సంతృప్తికరంగా లేదు అన్న భావన గట్టిగా వినిపిస్తోంది. మెగా డీఎస్సీని (Mega DSC) ప్రకటించారు. ఇది తొలుత నిరుద్యోగులకు మంచి ఆశలు కలిగించింది. కానీ, మెగా డీఎస్సీ ప్రకటన ఆరంభంలో ఉత్సాహాన్నిచ్చినా, తరువాత తగ్గుతూ వచ్చింది. ఏడు నెలలు గడిచినా నోటిఫికేషన్ ఇవ్వకపోవడం నిరుద్యోగుల్లో అసంతృప్తిని కలిగిస్తోంది. ప్రజల్లో మొదట ఉండిన నమ్మకం, మద్దతు క్రమంగా తగ్గడం ఆందోళన కలిగించే విషయం.
అలాగే, ఉచిత గ్యాస్ సిలిండర్ల (Free gas cylinder scheme) పథకం కూడా ప్రారంభంలో ఆకర్షణీయంగా కనిపించింది. ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు సిలిండర్లను అందజేస్తామని ప్రకటించిన ఈ పథకం గడిచిన డిసెంబర్లో ప్రారంభమైంది. ప్రజలలో కూటమిపై మంచి అభిప్రాయాన్ని కలిగించే మద్దతు పెంచుతుంది అనుకున్న ఈ పథకం క్షేత్రస్థాయిలో విఫలమవుతున్నట్లు టాక్ నడుస్తోంది. దీనికి ప్రధాన కారణం పథక అమలులో ఎదురైన సమస్యలే.
లబ్ధిదారులు ముందుగా సొమ్ము చెల్లించి సిలిండర్ తీసుకోవాల్సిన అవసరం వల్ల చాలా మంది దీనిని ఉపయోగించలేకపోయారు. క్షేత్రస్థాయిలో ఏర్పడిన పొరపాట్ల, రాజకీయాలు కారణంగా చాలామంది లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ కావడం ఆలస్యం కావడం సమస్యను మరింత పెద్దదిగా చేసింది. పైగా, ఈ పథకం వల్ల ప్రజలకు ఎంత మేలు జరుగుతుందో ప్రభుత్వం చెప్పుకోలేకపోవడం, ప్రజల్లో ప్రభుత్వం పట్ల అసంతృప్తి పెరగడానికి దారితీసింది.
ఈ పరిస్థితులు ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రికి ఒత్తిడి పెంచుతున్నాయి. కేంద్రం అమలు చేస్తున్న కొన్ని నిబంధనలను సవరించాలనే ఆలోచన వచ్చినప్పటికీ, కేంద్రం నుండి ఎటువంటి స్పష్టత లేకపోవడం పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చింది. ముఖ్యమంత్రి అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం పథకాలకు మైలేజీ తీసుకురావడంలో కొంత వెనుకబడింది. ప్రజల నమ్మకాన్ని తిరిగి పొందడం, తగిన వ్యూహాలతో సమస్యలను పరిష్కరించడం ప్రభుత్వానికి ప్రధాన పరీక్షగా మారింది. ఇలాంటి చర్చలు పార్టీ సర్కిళ్లలో కొనసాగుతుండగా, తగిన నిర్ణయాలు తీసుకుంటేనే ప్రజల్లో మళ్లీ విశ్వాసం కలుగుతుందనేది విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.













