ప్రతిపక్ష నేతగా జగన్ ఆనాడు అంగీకరించలేదా? : సుజనా చౌదరి
అమరావతిని ఆనాడు ప్రతిపక్ష నేతగా జగన్ అంగీకరించలేదా? అని బీజేపీ ఎంపీ సుజనాచౌదరి ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధాని అమరావతిపై హైకోర్టు తీర్పును వక్రీకరిస్తూ కోర్టు అధికారులపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. రాజధానిపై అసెంబ్లీలో ప్రభుత్వ పెద్దలు మాట్లాడారు. సంఖ్యాబలం ఉందని దబాయిస్తే వక్రీకరణలు వాస్తవం కావు అన్నారు. పార్లమెంట్ ఆమోదించిన విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ప్రభుత్వం అమరావతిని రాజధానిగా నిర్ణయం తీసుకోవడం, దీనికి ఆనాడు విపక్షంలో ఉన్న వైసీపీ మద్దతివ్వడం జరిగిందన్నారు. ఇప్పుడు మళ్లీ రాజధాని మార్చాలంటే అసెంబ్లీ తీర్మానం చేసి పార్లమెంట్ ఆమోదానికి పంపాలి. విభజన చట్టాన్ని ఉల్లంఘించి రాజధానిని మార్చడం న్యాయపరంగా చెల్లదన్నారు.
సీఆర్డీఏకి, భూములిచ్చిన రైతులకు మధ్య చట్టబద్దమైన ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించడం, సీఆర్డీఏని రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు. శాసనసభకు, ప్రభుత్వానికి చట్టాలు చేసే అధికారం లేదని కోర్టు చెప్పలేదన్నారు. వికేంద్రీకరణ పేరుతో విద్వేష రాజకీయాలకు తెర తీస్తున్నారు. రాజకీయ దురుద్దేశంతో జగన్ ప్రభుత్వం మళ్లీ 3 రాజధానుల బిల్లు తెస్తే న్యాయ సమీక్షకు నిలవదన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు కావాల్సింది అధికార వికేంద్రీకరణ కాదు, అభివృద్ధి వికేంద్రీకరణ అని అన్నారు. ఏపీ సమగ్రాభివృద్ధికి, ఏకైక రాజధాని అమరావతి అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని అన్నారు.













