టీటీడీకి రూ. 5 కోట్లు విరాళం
తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ బృందావనంలో నిర్మించనున్న ధాన్య మందిరానికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు ఎ.అయోధ్యరామి రెడ్డి అందించిన రూ.5 కోట్ల విరాళంతో 1.5 ఎకరాల విస్తీర్ణంలో 350 మంది భక్తులు కూర్చొని ధ్యానం చేసేందుకు వీలుగా అన్ని వసతులతో ఇక్కడ ధ్యాన మందిరం నిర్మించనున్నట్లు తెలిపారు. దాత అయోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ వెంగమాంబ బృందావనంలో ధాన్యమందిరం నిర్మించే అవకాశాన్ని శ్రీ వేంకటేశ్వరస్వామివారు తనకు కల్పించడం పూర్వజన్మసుకృతం అన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి, జేఈవోలు సదాభార్గవి, వీరబ్రహ్మం, సీఈ నాగేశ్వరరావు, అదనపు సీవీఎస్వో శివకుమార్ రెడ్డి, ఈఈ జగన్మోహన్ రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.













