తిరుమలలో ఘనంగా శ్రీవారి జ్వేష్ఠాభిషేకం
తిరుమల శ్రీవారి ఆలయంలో స్వామివారి జ్వేష్ఠాభిషేక సేవను ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏడాది జ్వేష్ఠమాసంలో జ్వేష్ఠ నక్షత్రం ముగిసేటట్లుగా మూడు రోజుల పాటు సంపంగి ప్రాకారంలోని కల్యాణ మండపంలో ఈ కార్యక్రమాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తోంది. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు మలయప్ప స్వామికి బంగారు కవచాన్ని తీసివేసి హోమాలు, అభిషేకాలు, పంచామృతాలతో స్నపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు మలయప్ప స్వామికి వజ్రకవచాన్ని అలకరింపజేశారు. అనంతరం స్వామి, అమ్మవార్లను తిరుమాడవీధుల్లో ఊరేగించారు. అత్యంత ప్రాచీనమైన శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామివారి ఉత్సవమూర్తుల విగ్రహాలు అరిగిపోకుండా పరీక్షించే నిమిత్తం తరతరాలుగా ఇలాంటి జ్వేష్ఠాభిషేకాన్ని నిర్వహిస్తారని అర్చకులు తెలిపారు.













