14 వరకు శ్రీవారి దర్శనాలు నిలిపివేత
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో నివారణ చర్యల్లో భాగంగా శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతించకూడదని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్ణయించింది. ఏప్రిల్ 14 వరకు స్వామివారికి కేవలం నిత్య కైంకర్యాలను మాత్రమే నిర్వహిస్తామని, భక్తులను దర్శనానికి అనుమతించబోమని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు ప్రకటించింది. మరోవైపు రెండు కనుమ రహదారులను దేవస్థానం అధికారులు మూసివేశారు. టీటీడీ సిబ్బంది తిరుమలలో వారం రోజుల పాటు షిప్ట్ పద్ధతిలో విధులు నిర్వహించనున్నారు. తిరుపతిలో 50 వేల మందికి దేవస్థానం తరపున ఆహారం పంపిణీ చేస్తున్నారు. ఏప్రిల్ 2న శ్రీరామ నవమి సందర్భంగా నిర్వహించాల్సిన శ్రీవారి హనుమంత సేవను కూడా టీటీడీ రద్దు చేసింది. స్వామివారి వార్షిక వసంతోత్సవాలను కూడా కల్యాణ మండపంలో ఏకాంతంగా నిర్వహించాలని నిర్ణయించింది.













