IAS Sri Lakshmi: చీఫ్ సెక్రటరీ అయ్యే ఛాన్స్ మిస్ చేసుకున్న శ్రీలక్ష్మి..!
శాసన వ్యవస్థకు, కార్య నిర్వాహక వ్యవస్థకు ఒక నిర్దిష్టమైన రేఖ ఉంది. అలా కాకుండా ఆ రెండు వ్యవస్థలూ కలసిపోయి నిబంధనలను తుంగలో తొక్కితే ఏం జరుగుతుందో ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని వ్యవహారాలను చూస్తే అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి (YS Rajasekhar Reddy), వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan) అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది ఉన్నతాధికారులు వాళ్లకు వంతపాడి ఇష్టానుసారం వ్యవహరించారు. దీంతో చాలా మంది ఐఏఎస్ (IAS), ఐపీఎస్ (IPS) అధికారులు జైలుపాలయ్యారు. కేరీర్ ను నాశనం చేసుకున్నారు. అలాంటి వాళ్లలో ఒకరు ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి (Sri Lakshmi).!
ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా (AP Chief Secretary) ప్రస్తుతం నీరబ్ కుమార్ ప్రసాద్ (Nirabh Kumar Prasad) ఉన్నారు. ఆయన ఈ నెలాఖరుకు పదవీ విరమణ చేయబోతున్నారు. సీనియారిటీ పరంగా ఆయన తర్వాతి స్థానం శ్రీలక్ష్మిదే. ఆవిడే చీఫ్ సెక్రటరీ కావాల్సి ఉంది. కానీ ఆమె అలాంటి సువర్ణావకశాన్ని పోగొట్టుకున్నారు. ఆమె స్థానంలో సాయి ప్రసాద్ (Sai Prasad) ను చీఫ్ సెక్రటరీగా నియమించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. శ్రీలక్ష్మి తన చేజేతులా తన కెరీర్ ను నాశనం చేసుకున్నారని చెప్పొచ్చు.
శ్రీలక్ష్మి అత్యంత పిన్న వయసులోనే ఐఏఎస్ అధికారి అయ్యారు. 22 ఏళ్లకే ఆమె సివిల్స్ (Civils) పాస్ అయ్యారు. ఆవిడకు సుదీర్ఘ సర్వీస్ ఉంది. కేంద్ర సర్వీసుల్లో కూడా కీలక స్థానాలు చేపట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ శ్రీలక్ష్మి చేసిన కొన్ని పనులు ఆవిడ కెరీర్ ను మలుపు తిప్పాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం కాకముందు వరకూ శ్రీలక్ష్మికి ఎంతో మంచి పేరుంది. సమర్థ అధికారిణిగా ఆవిడ గుర్తింపు తెచ్చుకున్నారు. చిన్న వయసులోనే అంతటి మంచి పేరు తెచ్చుకోవడం వార్తల్లో వ్యక్తిగా ఉండేవారు.
అయితే వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక ఆవిడ నిబంధనలు ఉల్లంఘించారు. అప్పటి సీఎం, మంత్రులు చెప్పినట్లు సంతకాలు చేసుకుంటూ వెళ్లారు. దీంతో ఆవిడపై కేసులు నమోదయ్యాయి. సీబీఐ ఆవిడను అరెస్టు చేసి జైలుకు పంపించింది. జగన్, విజయసాయి రెడ్డి సహా ఆవిడ కూడా కొన్ని నెలలపాటు జైల్లో ఉండాల్సి వచ్చింది. తర్వాత బయటకు వచ్చేటప్పటకి ఆరోగ్యం క్షీణించింది. ఇంతలో రాష్ట్ర విభజన జరగడం, ఏపీలో చంద్రబాబు సీఎం కావడంతో తెలంగాణలోనే ఉండిపోయింది.
జగన్ సీఎం అయ్యాక మళ్లీ ఆవిడ ఆంధ్రప్రదేశ్ (AP) లో అడుగు పెట్టింది. మున్సిపల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా (Special Chief Secretary) ఆవిడకు బాధ్యతలు అప్పగించారు. ఈ సమయంలో కూడా ఆవిడ జగన్ కు వంతపాడారనే ఆరోపణలున్నాయి. టీడీఆర్ బాండ్లు, ఆర్5 జోన్ వ్యవహారాల్లో ఆవిడ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. దీంతో ప్రభుత్వం మారగనే చంద్రబాబును కలిసేందుకు ఆవిడ ప్రయత్నించారు. కానీ చంద్రబాబు (Chandrababu) ఆవిడ బొకేను తీసుకునేందుకు నిరాకరించారు. ఇప్పుడు సీనియారిటీ ప్రకారం చీఫ్ సెక్రటరీ అయ్యే అవకాశాన్ని కోల్పోయారు. గతమెంతో ఘనకీర్తి కలిగిన శ్రీలక్ష్మి ఇప్పుడు కెరీర్ పరంగా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటున్నారు.













