అంగరంగ వైభవంగా కాణిపాకం బ్రహ్మోత్సవాలు
ప్రథమ పూజ్యుడైన గణనాథుని బ్రహ్మోత్సవాలకు కాణిపాకం క్షేత్రం సర్వం సిద్ధమవుతోంది. ఆగస్టు 31వ తేదీ బుధవారం నుంచి సెప్టెంబర్ 20వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారు సిద్ధి, బుద్ధి సమేతంగా వివిధ వాహనాలలో విహరిస్తూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. సత్య ప్రమాణాల దేవుడైన వినాయకుడిని దర్శించుకోవడానికి రాష్ట్రం నలుమూలలతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి పెద్ద సంఖ్యలో తరలి రానున్నారు. వారికి అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.













