ఒంటిమిట్టలో వైభవోపేతంగా సీతారాముల కల్యాణం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట కోదండరామాలయం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం సీతారాముల కల్యాణం వైభవోపేతంగా జరిగింది. పాంచరాత్ర ఆగమపండితుల మంత్రోచ్చరణలు, మంగళవాద్యాల మధ్య కల్యాణం క్రతువు రాత్రి 8 నుంచి 10 గంటల వరకు వేడుకగా సాగింది. స్వామివారి కల్యాణోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్సవమూర్తుల శోభాయాత్ర మందిరం నుంచి కల్యాణవేదిక వరకు నిర్వహించారు. విద్యుద్దీప కాంతుల మధ్య ఒంటిమిట్ట ఏకశిలా క్షేత్రం ఇలవైకుంఠంగా కనువిందు చేసింది. కల్యాణోత్సవానికి విచ్చేసిన భక్తకోటికి ముత్యాల తలంబ్రాలను పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ తరపున మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు పట్టువస్త్రాలను, దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. కల్యాణోత్సవంలో మంత్రి రోజా, టీటీడీ చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి, జేఈవోలు వీరబ్రహ్మం పాల్గొన్నారు.













