శ్రీ చైతన్య విద్యాసంస్థల అధినేత డాక్టర్ బి.ఎస్.రావు కన్నుమూత..!
శ్రీ చైతన్య విద్యాసంస్థల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు రాష్ట్రాల్లో విద్యాసంస్థలంటే మొదట గుర్తొచ్చేది శ్రీ చైతన్యే. ఈ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ బి.ఎస్.రావు. ఆయన పూర్తి పేరు డాక్టర్ బొప్పన సత్యనారాయణ రావు. అనారోగ్యంతో ఆయన ఇవాళ కన్నుమూశారు. కొంతకాలం కిందట ఆయన బాత్ రూంలో ప్రమాదవశాత్తూ జారిపటినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో ఆయనకు బ్రెయిన్ సర్జరీ చేశారు. అప్పటి నుంచి ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయితే ఇవాళ ఆయన హైదరాబాద్లో తుది శ్వాస విడిచారు. ఆయన భౌతిక కాయాన్ని విజయవాడ తరలిస్తున్నారు. రేపు తాడిగడప క్యాంపస్ లో అంత్యక్రియలు జరుగుతాయని సమాచారం.
డాక్టర్ బి.ఎస్.రావు స్వతహాగా వైద్యులు. ఆయన భార్య కూడా డాక్టరే. ఇద్దరూ తొలినాళ్లలో ఇంగ్లండ్, ఇరాన్ లలో వైద్య సేవలు అందించారు. అనంతరం ఇండియా వచ్చేసి విజయవాడలో శ్రీ చైతన్య విద్యాసంస్థను ప్రారంభించారు. 1986లో ప్రారంభమైన శ్రీ చైతన్య.. అంచలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించింది. ప్రస్తుతం శ్రీచైతన్య పేరుతో 321 జూనియర్ కాలేజీలు, 322 టెక్నో స్కూళ్లు, 107 సీబీఎస్ఈ పాఠశాలలను నడుపుతున్నారు. ఇక మెడిసిన్, ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలతో పాటు సివిల్స్ కోచింగ్ కూడా అందిస్తోంది శ్రీ చైతన్య.
శ్రీ చైతన్య విద్యాసంస్థల్లో చదువుకున్న వేలాది మంది విద్యార్థులు ఇప్పుడు ఎన్నో ఉన్నత పదవుల్లో ఉన్నారు. దేశవిదేశాల్లో మంచి పొజిషన్లో ఉన్నారు. తమ పిల్లలు ర్యాంక్ సాధించాలంటే కచ్చితంగా శ్రీచైతన్యలోనో, నారాయణలోనో చదవాలనే ఫీలింగులో తల్లిదండ్రులు ఉంటారు. అందుకే ప్రతీ విద్యార్థినీ తమ పిల్లలుగానే భావిస్తుంటామని డాక్టర్ బి.ఎస్.రావు దంపతులు చెప్తుంటారు. అందుకే అమ్మలాంటి లాలన.. నాన్న లాంటి పాలన.. అని తమ సంస్థ నినాదంగా పెట్టుకున్నారు. పరీక్ష ఏదైనా శ్రీచైతన్య విద్యార్థులు టాప్ 10లో ఉండడం పక్కా. అంతేకాదు.. ఇప్పుడు జాతీయ స్థాయిలో తెలుగు విద్యార్థులకు టాప్ ర్యాంక్స్ సాధ్యమవుతున్నాయంటే అందుకు శ్రీచైతన్యే కారణం అని చెప్పొచ్చు. ఇన్నాళ్లూ డాక్టర్ బిఎస్ రావు నేతృత్వంలో శ్రీ చైతన్య విద్యాసంస్థల ప్రస్థానం దినదినప్రవర్తమానంగా ఎదిగింది. అయితే కొంతకాలంగా ఆయన కుమార్తెలు విద్యాసంస్థల బాధ్యతలు చూస్తున్నారు.













