Chandrababu: ఆడబిడ్డల రక్షణకు ప్రత్యేక చట్టం: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) మహిళల రక్షణ కోసం త్వరలో ప్రత్యేక చట్టం తీసుకు వస్తామని తెలిపారు. మహిళల జోలికొస్తే ఎవరికైనా అదే చివరి రోజు అని ఆయన హెచ్చరించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్‌లో ‘శ్రీ శక్తి’ ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన (CM Chandrababu) మాట్లాడారు. ఈ పథకం ద్వారా 2.62 కోట్ల మంది మహిళలకు లబ్ధి చేకూరుతుందని, ఐదు రకాల బస్సుల్లో వారు ఉచితంగా ప్రయాణించవచ్చని సీఎం తెలిపారు. దీనితో మహిళలు ఏపీలో ఎక్కడికైనా, పుణ్యక్షేత్రాలకు కూడా ఉచితంగా వెళ్లవచ్చని పేర్కొన్నారు. సూపర్‌సిక్స్ పథకాలు సూపర్‌హిట్ అయ్యాయని ఆయన (CM Chandrababu) వ్యాఖ్యానించారు. వైసీపీ పాలనలో ప్రజలు ఆనందాన్ని కోల్పోయారని విమర్శించారు. మహిళా సాధికారత కోసం మెప్మా, డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేశామని, రాబోయే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామని ఆయన తెలిపారు. ఆర్టీసీ కండక్టర్లుగా మహిళలను తొలిసారిగా నియమించింది తమ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. భవిష్యత్తులో మహిళలు ఆర్టీసీ డ్రైవర్లుగా కూడా రావాలని ఆయన ఆకాంక్షించారు. ఎలక్ట్రికల్ ఏసీ బస్సులే కొనుగోలు చేస్తామని, ఆటో డ్రైవర్ల సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం వేస్తామని సీఎం (CM Chandrababu) హామీ ఇచ్చారు.







