వైసీపీ – టీఆర్ఎస్ మధ్య మాటల మంటలు..! అగ్గి రాజేసిందెవరు..?
ఏపీలో వైసీపీ అధికారంలో ఉంది. తెలంగాణలో టీఆర్ఎస్ పరిపాలన సాగుతోంది. 2018లో టీఆర్ఎస్ తెలంగాణలో రెండోసారి అధికారంలోకి వచ్చింది. 2019 ఎన్నికల్లో ఏపీలో జగన్ నేతృత్వంలోని వైసీపీ ఘన విజయం సాధించింది. ఏపీలో జగన్ పాలనను టీఆర్ఎస్ స్వాగతించింది. జగన్ ను ప్రగతి భవన్ కు పిలిచి విందు కూడా ఇచ్చారు కేసీఆర్. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య గ్యాప్ తగ్గిపోతుందని.. సమస్యలకు కూడా పరిష్కారం లభిస్తుందని రెండు రాష్ట్రాల ప్రజలూ ఆశించారు. అయితే ఈ ముచ్చట రెండేళ్లు కూడా సాగలేదు. రెండు రాష్ట్రాల మధ్య గ్యాప్ పెరిగిపోయింది. ఇరువురి ప్రయారిటీలు వేరు కావడంతో రెండు రాష్ట్రాల మధ్య మళ్లీ యుద్ధపూరిత వాతావరణం నెలకొంది. తాజాగా తెలంగాణ మంత్రి హరీశ్ రావు, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి చేసిన కామెంట్స్ రెండు పార్టీల మధ్య, రాష్ట్రాల మధ్య అగ్గి రాజేసినట్లయింది.
ఇటీవల తెలంగాణ మంత్రి హరీశ్ రావు ఏపీ సర్కార్ పై సెటైర్లు వేశారు. ఏపీలో బోరుబావులకు మోటార్లు బిగిస్తున్నారని.. అక్కడ టీచర్లు ఆందోళనలు చేస్తున్నారని .. వాళ్లపై కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారని హరీశ్ రావు వ్యాఖ్యానించారు. ఈ కామెంట్స్ రచ్చ రాజేశాయి. హరీశ్ రావు కామెంట్స్ పై వైసీపీ నేతలు తీవ్రంగా స్పందించారు. హరీశ్ రావు ఏ సందర్భంలో ఈ కామెంట్స్ చేశారో అర్థం కావట్లేదన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. వాళ్ల సమస్యలు ఏవైనా ఉంటే వాళ్లు చూసుకోవాలని.. మమ్మల్ని తిట్టి మాతో కేసీఆర్ ను తిట్టించడం కోసమే హరీశ్ రావు కామెంట్స్ చేస్తున్నారేమో .. అనిపిస్తోందన్నారు. ఆంధ్ర నాయకులను రెచ్చగొట్టి.. మళ్లీ మాతో తిట్టించుకుని సానుభూతి పొంది ఎన్నికల్లో లబ్ది పొందే ప్రయత్నం చేస్తున్నట్టు అర్థమవుతోందన్నారు సజ్జల.
ఇక సజ్జల కామెంట్స్ పై తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ మరింత ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ పార్టీ బీజేపీకి బీ-పార్టీగా వ్యవహరిస్తోందన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి తమతో ఎందుకు పెట్టుకుంటున్నారో అర్థం కావట్లేదని.. ఆయన జగన్ కు సలహాదారు కానీ తమకు కాదన్నారు. ఏవైనా సలహాలు ఇవ్వాలనుకుంటే జగన్ కు ఇచ్చుకోవాలని సూచించారు గంగుల. మాతో పెట్టుకోవద్దని.. పెట్టుకుంటే ఏం జరుగుతుందో మీరు గతంలో చూసారు కదా అని హెచ్చరించారు. వై.ఎస్.కుటుంబంలోకి వచ్చి తల్లికి, కొడుకుకి, చెల్లికి, అన్నకు చిచ్చుపెట్టిన వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి అని గంగుల తీవ్ర ఆరోపణలు చేశారు. కేసీఆర్ కుటుంబాన్ని విడగొట్టాలనే ప్రయత్నం సఫలం కాదన్నారు.
జగన్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని.. అందుకే ఆంధ్రా నుంచి తెలంగాణలు వలస వస్తున్నారని చెప్పారు గంగుల కమలాకర్. పర్సనల్ గా ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ప్రశ్నించారు. మా ముఖ్యమంత్రిజోలికి, మా ప్రభుత్వం జోలికి వస్తే దాడులు చేస్తామని హెచ్చరించారు. మేం రెచ్చిపోకముందే మా జోలికి రాకండి అని సూచించారు.
మరోవైపు ఏపీ మంత్రి అంబటి రాంబాబు కూడా హరీశ్ రావు కామెంట్స్ పై సీరియస్ గా స్పందించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది వైసీపీ ప్రభుత్వమేనన్నారు. హరీశ్ రావు ఈ అంశంపై చర్చకు రావాలని సూచించారు. తప్పుడు ఆరోపణలు చేయవద్దని హితవు పలికారు. మొత్తంగా ఏపీ, తెలంగాణ మంత్రుల మాటలు రెండు పార్టీల మధ్య, రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టాయి.













