వారసులకు నో ఎంట్రీ..! జగన్ వ్యూహమేంటి?
వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లోని 175 అసెంబ్లీ స్థానాలనూ క్లీన్ స్వీప్ చేయాలనేది వైసీపీ అధినేత జగన్ టార్గెట్. ఇందుకోసం అన్ని రకాల వ్యూహాలనూ రచిస్తున్నారాయన. గత ఎన్నికల్లో 151 సీట్లు గెలిచినప్పుడు ఈసారి 175 సీట్లనూ ఎందుకు గెలవలేమనేది ఆయన ప్రశ్న. పార్టీ శ్రేణులకు ఇదే విషయాన్ని ఆయన పదే పదే చెప్తున్నారు. కష్టపడితే కచ్చితంగా గెలుస్తామని భరోసా ఇస్తున్నారు. పార్టీ నేతలను, ప్రజా ప్రతినిధులను ఆయన గడప గడపకు ప్రభుత్వం పేరిట ఇంటింటికీ పంపుతున్నారు. ప్రజల్లోకి వెళ్తే పాజిటివ్ ఫీలింగ్ వస్తుందని.. అది గెలుపునకు దారి తీస్తుందని ఆయన ఆలోచన. అయితే ఇదే సమయంలో ఆయన పార్టీ సీనియర్ నేతల ఆశలపై నీళ్లు చల్లారు. వారసులకు టికెట్లు ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. ఈ విషయంలో జగన్ వ్యూహమేంటి..?
రాజకీయం ఒక వ్యసనం. ఒక్కసారి ప్రవేశించాక అందులో నుంచి బయటకు రావడం చాలా కష్టం. తరాలుగా ఈ విషయాన్ని గమనిస్తున్నాం. తాతలు, తండ్రులు, కొడుకులు, మనుమలు, మునిమనుమలు.. ఇలా ఎవరైనా రాజకీయాల్లోనే కొనసాగాలనుకుంటారు. అందుకే దీపం ఉండగానే చక్కదిద్దుకోవాలని తపిస్తుంటారు. ఇప్పుడు ఏపీలో కూడా పలువురు వైసీపీ నేతలు ఈసారి ఎన్నికల్లో తమ వారసులను బరిలోకి దింపాలని భావిస్తున్నారు. వైసీపీ ఇప్పుడు అధికారంలో ఉంది. వచ్చే ఎన్నికల్లో కూడా కచ్చితంగా జగనే సీఎం అవుతారని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. అందుకే తమ వారసులను బరిలోకి దింపేందుకు ఇదే సరైన సమయమని సీనియర్ నేతలు అంచనా వేస్తున్నారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పలువురు వారసులు తెరవెనుక యాక్టివ్ అయిపోయారు. తండ్రులు అధికారంలో ఉన్నా.. తెరవెనుక పార్టీకార్యక్రమాలన్నింటినీ వారసులే చక్కదిద్దుతున్నారు. తండ్రులకు వెనుక నుంచి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమం అయినా.. పార్టీ కార్యక్రమం అయినా ప్రజల్లోకి వెళ్లేందుకు బాగా ట్రై చేస్తున్నారు. పార్టీ ఆదేశించిన గడపగడపకూ కార్యక్రమంలో కూడా వారసులు ఫుల్ యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. తండ్రులు పలు కారణాలతో బిజీగా ఉన్నా.. వారసులు మాత్రం ఇంటింటికీ తిరుగుతున్నారు. కేవలం వారసులను ప్రమోట్ చేయడం కోసమే గడపగడపకూ తిప్పుతున్న నేతలూ ఉన్నారు.
ఇదే విషయం జగన్ దృష్టికి వచ్చింది. చాలా చోట్ల ప్రజాప్రతినిధులు కాకుండా వారి వారసులు గడప గడపా తిరుగుతున్నారని తెలిసింది. దీంతో జగన్ అప్రమత్తమయ్యారు. కొంతమంది నేతలు తాము ఇంటింటికీ వెళ్లకుండా తమ వారసులను గడపగడపా తిప్పుతున్నారని.. అది పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టం చేశారు. అంతేకాక.. వచ్చే ఎన్నికల్లో వారసులకు టికెట్లు అడగవద్దని తేల్చి చెప్పారు. ఈసారికి మాత్రం బాగా పనిచేస్తున్న ప్రజాప్రతినిధులకే టికెట్లు ఇస్తామని.. వారసులకు టికెట్లు ఆశించవద్దని జగన్ ప్రకటించారు. బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి… తదితరులు తమ వారసులను బరిలోకి దింపాలని ట్రై చేస్తున్నారు. అయితే జగన్ వారి ఆశలపై నీళ్లు చల్లారు.
ఈసారి 175 స్థానాలనూ క్లీన్ స్వీప్ చేయాలనేది జగన్ లక్ష్యం. అందుకే ఎక్కడా చిన్న పొరపాటుకు కూడా తావు ఇవ్వకూడదనుకుంటున్నారట జగన్. వారసులకు టికెట్లు ఇస్తే జనం ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలీదు. అందుకే ప్రయోగాలు చేయకూడదనుకుంటున్నారట. అందుకే ఈసారి వారసులు కాకుండా తండ్రులే పోటీ చేయాలని జగన్ స్పష్టం చేశారు. మరి ఎన్నికల నాటికి ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయోమో చూడాలి.













