గల్లా ఫ్యామిలీపై కన్నేసిన వైసీపీ..! పార్టీ మార్పునకు రంగం సిద్ధం!!
ఎన్నికలు సమీపిస్తుండడంతో ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండూ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నాయి. నియోజకవర్గంలోని బలమైన అభ్యర్థులను అంచనా వేసి వాళ్లకు బాధ్యతలు అప్పగిస్తున్నారు పార్టీల అధినేతలు. ఎక్కడైనా వీక్ అభ్యర్థులున్నచోట ప్రత్యామ్నాయాలపై దృష్టి సారిస్తున్నారు. ప్రత్యర్థి వర్గంలో బలమైన అభ్యర్థులు ఉంటే వాళ్లను లాక్కునేందుకు స్కెచ్ వేస్తున్నారు. అలాంటి ప్లానే ఇప్పుడు ఒకటి బయటికొచ్చింది.
గల్లా కుటుంబాన్ని వైసీపీ తమ వైపునకు తిప్పుకునేందుకు మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్టు తెలుస్తోంది. గల్లా జయదేవ్ ప్రస్తుతం గుంటూరు లోక్ సభ స్థానం నుంచి టీడీపీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో ఈ కుటుంబానికి మంచి పట్టుంది. కనీసం నాలుగైదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రభావితం చేయగల సత్తా ఈ కుటుంబానికి ఉంది. ఇవన్నీ బేరీజు వేసుకున్న వైసీపీ అధిష్టానం గల్లా కుటుంబాన్ని వైసీపీలోకి తెచ్చుకోవాలనుకుంటున్నట్టు విశ్వసనీయ సమాచారం.
గల్లా కుటుంబానికి ఉన్న పట్టు దృష్ట్యా చిత్తూరు జిల్లాలోనే తల్లీ కుమారుడికి సీట్లు ఇస్తే బాగుంటుందనే ఆలోచన వైసీపీ పెద్దల్లో ఉన్నట్టు తెలుస్తోంది. గల్లా జయదేవ్ ను తిరుపతి నుంచి, గల్లా అరుణ కుమారిని పూతలపట్టు నుంచి పోటీ చేయించే యోచనలో జగన్ ఆలోచిస్తున్నట్టు సమాచారం. గల్లా అరుణకుమారి గతంలో కాంగ్రెస్ లో ఉండి మంత్రిగా పని చేశారు. వై.ఎస్. కుటుంబానికి సన్నిహితురాలిగా పేరొందారు. అయతే రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దారుణంగా తయారు కావడంతో తెలుగుదేశం పార్టీలో చేరింది గల్లా కుటుంబం. గల్లా జయదేవ్ ను గుంటూరు లోక్ సభ నుంచి బరిలోకి దింపి విజయం సాధించింది. ఆ తర్వాత 2019లో కూడా గల్లా జయదేవ్ రెండోసారి పార్లమెంటుకు ఎన్నికయ్యారు.
కాంగ్రెస్ లో ఓ వెలుగు వెలిగిన గల్లా కుటుంబం.. ఆ తర్వాత పరిణామాలతో టీడీపీలో చేరింది. 2014 నుంచి 2019 వరకూ టీడీపీలో కూడా వారికి తిరుగులేదు. అయితే 2019లో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వారి కుటుంబానికి చెందిన అమరరాజా బ్యాటరీస్ కంపెనీకి ఇబ్బందులు మొదలయ్యాయి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిబంధనలు పాటించట్లేదంటూ ప్రభుత్వం ఆ కంపెనీకు నోటీసులు ఇచ్చింది. కంపెనీని మూసేయాలని ఆదేశించింది. అయితే దీనిపై కోర్టుకు వెళ్లిన గల్లా కుటుంబం స్టే తెచ్చుకుంది. ఇప్పటికీ ఈ అంశం కోర్టులో ఉంది. ఈ పరిణామాలతో గల్లా కుటుంబానికి, వైసీపీ ప్రభుత్వానికి మధ్య యుద్ధం మొదలైంది.
అయితే.. ఇప్పుడు వైసీపీకి, గల్లా ఫ్యామిలీకి మధ్య దూరం తగ్గినట్లు వార్తలు అందుతున్నాయి. వ్యాపార ప్రయోజనాల దృష్ట్యా గల్లా కుటుంబం వైసీపీలోకి వెళ్లేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తమకు రాజకీయ ప్రయోజనాలకంటే వ్యాపారమే ముఖ్యం. కాబట్టి అందుకు ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండాలంటే రాజకీయంగా పట్టు విడుపులు ప్రదర్శించక తప్పట్లేదని గల్లా ఫ్యామిలీ చెప్తున్నట్టు తెలుస్తోంది. ఇది నిజమే అయితే వచ్చే ఎన్నికల్లో గల్లా కుటుంబం వైసీపీ జెండాతో బరిలోకి దిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.













