మాగుంట ఆఫీసులపై ఈడీ దాడులు.. ప్రకపంనలు రేపుతున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్!
ఢిల్లీ లిక్కర్ పాలసీలో అక్రమాలు జరిగాయంటూ సీబీఐ మొదలు పెట్టిన విచారణ ఇప్పుడు ఈడీ దూకుడుతో కొత్త మలుపులు తీసుకుంటోంది. దేశవ్యాప్తంగా ఈడీ మరోసారి సోదాలు నిర్వహిస్తోంది. 5 రాష్ట్రాల్లో ఏకకాలంలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ సహా హైదరాబాద్, నెల్లూరు, బెంగళూరు, చెన్నైలలో ఈడీ దాడులు జరుగుతున్నాయి. ఈ సోదాల్లో తెలుగు రాష్ట్రాల్లోని పలువురు ప్రముఖులకు సంబంధాలున్నాయని కేంద్రంలోని బీజేపీ ఆరోపిస్తోంది. అందుకు తగ్గట్లే ఇప్పుడు పలువురు రాజకీయ నాయకులతో సన్నిహిత సంబంధాలు కలిగిన వారి ఆఫీసులు, ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా నేతృత్వంలో ఈ స్కామ్ కు తెరలేపారని బీజేపీ ఆరోపిస్తోంది. బీజేపీ ఆరోపణల నేపథ్యంలో రంగంలోకి దిగిన సీబీఐ అవకతవకలు నిజమేనని తేల్చింది. మనీ లాండరింగ్ ఆరోపణలు రావడంతో ఈడీ రంగంలోకి దిగింది. అప్పటి నుంచి ఈ కేసు మరిన్ని మలుపులు తీసుకుంటోంది. తెలుగు రాష్ట్రాల్లోని పలువురు రాజకీయ, వ్యాపార వేత్తల ప్రమేయం ఉందని ఆరోపణలు రావడంతో ప్రకంపనలు మొదలయ్యాయి. ఆ నేపథ్యంలోనే ఈడీ ఇంతకుముందు ఒకసారి హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. పలు ఆధారాలను సేకరించింది.
తాజాగా… హైదరాబాద్, నెల్లూరులలో కూడా సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ లో గచ్చిబౌలి, నానక్ రామ్ గూడ, కోకాపేట, దోమల్ గూడ.. తదితర ప్రాంతాల్లో తనిఖీలు చేస్తోంది. అరుణ్ రామచంద్ర పిళ్లై, అభినవ్ రెడ్డికి చెందిన ఆఫీసులు, నివాసంలో ఈడీ దాడులు నిర్వహిస్తోంది. వీళ్లిద్దరూ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితకు అత్యంత సన్నిహితుడని బీజేపీ ఆరోపిస్తోంది. ఇప్పుడు వారి ఆఫీసులు, నివాసాల్లో సోదాలు నిర్వహిస్తుడడం ఆసక్తి కలిగిస్తోంది. అంతేకాక.. జాగృతి కార్యాలయానికి సమీపంలోని శ్రీ సాయికృష్ణ రెసిడెన్సీలో కూడా ఈడీ తనిఖీలు చేస్తోంది. ఇప్పటికే ఒకసారి వీళ్లిద్దరి నివాసాల్లో ఈడీ సోదాలు చేపట్టింది. ఇప్పుడు మరోసారి కూడా నిర్వహిస్తుండడోం ఆసక్తి కలిగిస్తోంది.
మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో లిక్కర్ వ్యాపారంలో అగ్రగామిగా ఉన్న వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డికి చెందిన ఆఫీసులు, నివాసాల్లో కూడా ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. మాగుంట నివాసాలు, ఆఫీసుల్లో ఈడీ తనిఖీలు చేయడం ఇదే తొలిసారి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో తనకు సంబంధం లేదని.. తాను ఎన్నో ఏళ్లుగా లిక్కర్ బిజినెస్ లో ఉంటున్నానని మాగుంట గతంలోనే ప్రకటించారు. పైగా తన బిజినెస్ షేర్ చాలా తక్కువని వివరించారు. పైగా సీబీఐ కానీ, ఈడీ కానీ మాగుంటకు చెందిన కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టకపోవడంతో మాగుంట సేఫ్ అని అందరూ భావించారు. అయితే ఇప్పుడు మాగుంట ఆఫీసులపై కూడా ఈడీ దాడులు చేస్తుండడం ఆశ్చర్యం కలిగించింది. ఢిల్లీతో పాటు నెల్లూరు, చెన్నైలోని ఇళ్లు, ఆఫీసుల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి.
ఢిల్లీ మద్యం వ్యాపారంలో మాగుంట ఆగ్రో ఫామ్స్ కంపెనీ భాగస్వామిగా ఉంది. ఇతరులతో కలిసి మాగుంట కంపెనీలు టెండర్లు దక్కించుకున్నాయి. మాగుంట కంపెనీతో పాటు ఇండో స్పిరిట్ కంపెనీ సిండికేట్ అయ్యాయనే ఆరోపణలు వస్తున్నాయి. మద్యం తయారీ కంపెనీలు ఢిల్లీలో లిక్కర్ షాపులు నడపరాదనే నిబంధనలున్నాయి. అయితే ఈ కంపెనీలు అక్రమంగా ఎల్1 లైసెన్స్ దక్కించుకున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీలోని నాలుగు జోన్లలో మాగుంటకు చెందిన దుకాణాలు ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. మరీ ఈ కేసు ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందో.. ఎవరెవరు తెరపైకి వస్తారోననే ఉత్కంఠ రోజురోజుకూ పెరుగుతోంది.













