టీడీపీలోకి దగ్గుబాటి ఫ్యామిలీ..? అసెంబ్లీ బరిలోకి పురంధేశ్వరి తనయుడు!
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఎప్పుడైనా, ఏదైనా జరగొచ్చు. ఇక్కడున్న వాళ్లు తెల్లారేసరికి ఇంకో పార్టీలోకి మారిపోవచ్చు. అక్కడున్న వాళ్ళు గోడ దూకి ఇక్కడికి వచ్చేయొచ్చు. అందుకే అంటుంటారు రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శతృవులు ఉండరని. ఇప్పుడు అలాంటి సంఘటనే ఒకటి జరగబోతోందని తెలుస్తోంది. ఇన్నాళ్లూ నారా కుటుంబానికి దూరంగా ఉన్న దగ్గుబాటి వెంకటేశ్వర రావు ఫ్యామిలీ.. త్వరలోనే తెలుగుదేశం గూటికి రాబోతోందని సమాచారం. ఇదే జరిగితే మళ్లీ నారా – నందమూరి కుటుంబాలన్నీ ఏకమైనట్టే.! ఇది ఏపీలో మరిన్ని పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది.
నందమూరి తారకరామారావు అల్లుళ్లు దగ్గుబాటి వెంకటేశ్వర రావు, నారా చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ నుంచి తెలుగుదేశం పార్టీని స్వాధీనం చేసుకునేంత వరకూ వీరంతా కలిసే ఉన్నారు. ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాలు ఈ రెండు కుటుంబాల మధ్య గ్యాప్ పెంచాయి. దీంతో ఎవరికివారే.. యమునాతీరే.. అన్నట్టు వ్యవహరించాయి. దగ్గుబాటి కుటుంబం వై.ఎస్. అండతో కాంగ్రెస్ పార్టీలో చేరింది. యూపీఏ హయాంలో పురంధేశ్వరి కేంద్ర మంత్రిగా కూడా పదవి చేపట్టారు. ఆ తర్వాత జరిగిన రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ పనైపోయింది. దీంతో దగ్గుబాటి పురంధేశ్వరి బీజేపీలో చేరారు. ఆ పార్టీలో పలు కీలక బాధ్యతలు చేపట్టారు.
మరోవైపు పురంధేశ్వరి బీజేపీలో ఉండగానే.. దగ్గుబాటి వెంకటేశ్వర రావు, ఆయన కుమారుడు హితేశ్ 2014లో వైసీపీలో చేరారు. అయితే ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వేర్వేరు పార్టీల్లో ఉండడం పలు ఆరోపణలకు, విమర్శలకు తావిచ్చింది. అయితే వైసీపీలో దగ్గుబాటి, ఆయన కుమారుడు యాక్టివ్ రోల్ ప్లే చేయలేదు. పైగా దగ్గుబాటి వెంకటేశ్వర రావు తాను రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. దీంతో పురంధేశ్వరి మాత్రమే బీజేపీలో యాక్టివ్ రోల్ ప్లే చేస్తూ వస్తున్నారు.
అయితే ఇప్పుడు పరిణామాలు మారిపోయాయి. ఎన్టీఆర్ పెద్ద కుమార్తె ఉమామహేశ్వరి కుమార్తె వేడుకల్లో దగ్గుబాటి, నారా కుటుంబాలు ఒక్కటయ్యాయి. దగ్గుబాటి, చంద్రబాబు ఆప్యాయంగా మాట్లాడుకోవడం, కుటుంబసభ్యులంతా సన్నిహితంగా మెలగడంతో ఆ కుటుంబాల మధ్య గ్యాప్ తగ్గిందని అందరూ భావించారు. మరోవైపు బీజేపీలో పురంధేశ్వరి పరిస్థితి కూడా ఏమాత్రం బాగోలేదు. పార్టీ కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చినా తనకు ఏమాత్రం గుర్తింపు దక్కలేదనే ఆవేదన పురంధేశ్వరిలో ఉన్నట్టు తెలుస్తోంది. పైగా బీజేపీ తరపున ఎంత కష్టపడినా ఏపీలో అధికారంలోకి రావడం కష్టమనే భావన దగ్గుబాటి ఫ్యామిలీలో ప్రారంభమైంది. దీంతో ఆ కుటుంబం పునరాలోచనలో పడింది.
దగ్గుబాటి ఫ్యామిలీ మళ్లీ తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్టు కొన్ని రోజులుగా ప్రచారం జోరందుకుంది. కుటుంబాల మధ్య సఖ్యత పెరగడం, వైసీపీ, బీజేపీలో తమకు తగిన ప్రాధాన్యత దక్కకపోవడంతో తెలుగుదేశమే బెటర్ అనే ఫీలింగ్ వారికి కలిగినట్లు సన్నిహితుల చెప్తున్న మాట. అన్నీ అనుకున్నట్టు జరిగితే త్వరలోనే దగ్గుబాటి ఫ్యామిలీ టీడీపీ గూటికి రావడం ఖాయంగా కనిపిస్తోంది. టీడీపీ తరపున చీరాల లేదా పర్చూరు నుంచి దగ్గుబాటి హితేశ్ పోటీలో నిలిచే అవకాశం ఉంది. పురంధేశ్వరి కూడా ప్రకాశం జిల్లాలోని ఏదైనా లోక్ సభ స్థానం నుంచి బరిలోకి దిగొచ్చని తెలుస్తోంది. చూద్దాం.. మరి ఏం జరుగుతుందో!













