మంత్రులకు జగన్ సీరియస్ వార్నింగ్! మరోసారి మంత్రివర్గ విస్తరణ జరపమంటారా అని హెచ్చరిక..!
ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి కేబినెట్ సహచరులకు సీరియస్ క్లాస్ పీకారు. ఇటీవల ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లోని పలువురి పేర్లు కూడా బయటికొచ్చాయి. అందులో భాగంగా టీడీపీ నేతలు.. సీఎం జగన్ ఫ్యామిలీకి కూడా ఇందులో భాగం ఉందంటూ ఆరోపించారు. దీనిపై వైసీపీ కూడా దీటుగానే బదులిచ్చింది. చంద్రబాబు ఫ్యామిలీ మెంబర్స్ పచ్చి తాగుబోతులంటూ వైసీపీ మహిళా నేతలు విమర్శలు గుప్పించారు. ఇదే అంశంపై కేబినెట్ మీటింగ్ లో సీరియస్ చర్చ జరిగింది. ఈ సందర్భంగానే మంత్రులపై సీఎం జగన్ మండిపడ్డారు.
తమ ప్రభుత్వం ఎన్నో మంచి పనులు చేస్తున్నా.. ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తూనే ఉన్నాయని.. అలాంటి వాటిని తిప్పికొట్టడంలో మంత్రులు విఫలమవుతున్నారని సీఎం జగన్ మండిపడ్డారు. తాజాగా మద్యం కుంభకోణానికి సంబంధించి తమ పాత్ర లేకపోయినా మాటలు పడాల్సి వస్తోందని.. అలాంటి వాటిని తిప్పికొట్టాల్సిన బాధ్యత కేబినెట్ మంత్రులకు లేదా అని జగన్ ప్రశ్నించారు. ఏకంగా తమ ఫ్యామిలీపైనే ఈసారి ఆరోపణలు వచ్చాయని.. ఇలాంటప్పుడు కూడా మంత్రులు మౌనంగా ఉంటే ఎలా అని నిలదీశారు. చోటామోటా నేతలు రెస్పాండ్ అయినా.. మంత్రులు మిన్నకుండి పోయారని.. మీకు బాధ్యత లేదా.. అని ఆగ్రహం వ్యక్తంచేశారు జగన్. అంతటితో ఆగని సీఎం.. మరోసారి మంత్రివర్గ విస్తరణ జరపాలా.. అని హెచ్చరించారు.
సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో కేబినెట్ మంత్రులు షాక్ కు గురయ్యారు. గతంలో ఎన్నడూ సీఎం జగన్ ను ఇలా చూడలేదని.. ఇప్పుడు ఆయన ఆగ్రహం చూసిన వారు చెప్తున్నారు. జగన్ వార్నింగ్ తో మంత్రులంతా అలర్ట్ అయ్యారు. ఇకపై ఇలాంటి పొరపాట్లు జరగవని.. జాగ్రత్తగా ఉంటామని మంత్రులు జగన్ కు మాటిచ్చారు. ఈసారికి మన్నించాలని కోరారు. అయినా సీఎం జగన్ మాత్రం మంత్రులతో కాస్త ఘాటుగానే వ్యవహరించారు. మంచి పనులు చేస్తున్నా మాటలు పడాల్సి వచ్చినప్పుడు బాధగా ఉంటుందని.. అయినా సహిస్తున్నామన్నారు. ఇప్పుడు ఏకంగా తన కుటుంబ సభ్యులను కూడా బజారుకీడుస్తుంటే చూస్తూ ఊరుకోవాలా.. అని ప్రశ్నించారు.
లిక్కర్ స్కామ్ ఆరోపణలపై మంత్రులు రెస్పాండ్ కాలేదు. ఒక్క ఉషశ్రీ చరణ్ మాత్రమే స్పందించారు. ఒకరిద్దరు మహిళా ఎమ్మెల్సీలు రియాక్ట్ అయ్యారు. ఇదే జగన్ ఆగ్రహానికి కారణమమైంది. ఇంతమంది మంత్రులున్నా.. ఇలాంటి అంశాలపై స్పందించకపోవడమేంటని ఆయన మండిపడ్డారు. ఇందుకేనా మిమ్మల్ని మంత్రులను చేసిందని ప్రశ్నించారు. ఆరోపణలు ఖండించనప్పుడు మీకు పదవులు ఎందుకని అడిగారు. దీంతో కేబినెట్ మీటింగ్ లో ఒక్కసారిగా గంభీర వాతావరణం నెలకొంది. చివరకు మంత్రులందరూ సీఎంకు సారీ చెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది.













