హాట్‌హాట్‌గా బీఏసీ మీటింగ్: మీరు ఒకటంటే మా వాళ్లు పదంటారు .. అచ్చెన్నాయుడికి సీఎం జగన్ హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్ లో అధికార, ప్రతిపక్షాల మధ్య వైరం ఎలా కొనసాగుతోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెండు పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇరువర్గాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై మరొకరు భౌతిక దాడులు చేసుకునేంత వరకూ వెళ్తున్నారు. పార్టీ కార్యాలయాలపై దాడులు, ఒకరి కార్యక్రమాన్ని మరొకరు అడ్డుకోవడం.. ఇలా అడుగడుగునా వారి మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఇప్పుడు ఈ మాటల దాడి అసెంబ్లీ వరకూ చేరింది. అసెంబ్లీ సమావేశాల తొలిరోజు బీఏసీ సమావేశంలో కూడా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి.
అసెంబ్లీ సమావేశాలను ఎలా నిర్వహించాలి.. ఎన్ని రోజులు నిర్వహించాలి.. ఏ ఏ అంశాలపై చర్చ జరగాలి.. అనే అంశాలను సాధారణంగా బీఏసీ సమావేశంలో చర్చిస్తుంటారు. అయితే ఈసారి మాత్రం వాటితో పాటు రాజకీయాల ప్రస్తావన చోటు చేసుకుంది. అధికార ప్రతిపక్షాల మధ్య బయట జరుగుతున్న విమర్శలు, దాడులు.. లాంటి అంశాలపై చర్చ జరిగింది. సభలో గందరగోళం సృష్టించడంపై సీఎం జగన్.. అచ్చెన్నాయుడిని ప్రశ్నించారు. ఏ అంశంపైనైనా తాము చర్చకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. మీరు 17 మంది ఉంటే మేము 150 మంది ఉన్నామన్నారు.
అయితే తమ అధినేత కుటుంబసభ్యులపై విమర్శలు చేయడమేంటని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. అయితే కుప్పంలో వైసీపీ గెలుపు తర్వాత తన కుటుంబసభ్యులను వైసీపీ వాళ్లేదో అన్నట్టు చంద్రబాబు కలరింగ్ ఇచ్చారని జగన్ చెప్పారు. సభలో గొడవలు చేయకుండా సజావుగా సాగేందుకు సహకరించాలని జగన్ కోరారు. మీరు ఒకటంటే మా వాళ్లు పది మాటలంటారని జగన్ స్పష్టం చేశారు. కాబట్టి విమర్శలకు తావివ్వకుండా సభకు సహకరించాలని సూచించారు.
అయితే.. సభలో మేరుగ నాగార్జున చేసిన కామెంట్స్ పై అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. పుట్టుక గురించి విమర్శించడం ఏంటని నిలదీశారు. మరి కృష్ణా జిల్లా సమావేశంలో బచ్చుల అర్జునుడు వ్యక్తిగత కామెంట్లు చేయలేదా అని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి లేవనెత్తారు. మరి కొడాలి నాని ఎలాంటి కామెంట్లు చేశారో చూడలేదా అని అచ్చెన్నాయుడు కౌంటర్ ఇచ్చారు. ఇదే సమయంలో అయ్యన్నపాత్రుడు ఇష్టానుసారంగా మాట్లాడారని మంత్రి జోగి రమేష్ లేవనెత్తారు. చంద్రబాబు స్క్రిప్టు రాసిస్తే అయ్యన్నపాత్రుడు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నార్నారు. అయితే జగన్ స్క్రిప్టు రాసిస్తే వైసీపీ నేతలు ఇలా మాట్లాడుతున్నారని మేమెప్పుడైనా అన్నామా అని అచ్చెన్నాయుడు ఎదురు ప్రశ్నించారు.
ఇంతలో జోక్యం చేసుకున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. తాము ఏవైనా మాట్లాడేముందు అందరం మాట్లాడుకునే స్పందిస్తామన్నారు. మరి పార్టీ కార్యాలయంపై దాటి.. చంద్రబాబు ఇంటిపై దండెత్తడం లాంటి వాటిని అచ్చెన్నాయుడు లేవనెత్తారు. చంద్రబాబు ఇంటిపైకి జోగి రమేశ్ ఎందుకొచ్చారని ప్రశ్నించారు. అయితే అయ్యన్నపాత్రుడు కామెంట్స్ చేయడం వల్లే తాను చంద్రబాబు ఇంటి వద్దకు వచ్చానన్నారు జోగి రమేశ్. అయ్యన్న పాత్రుడు కామెంట్స్ చేస్తే చంద్రబాబు ఇంటిపైకి రావడమేంటని అచ్చెన్నాయుడు నిలదీశారు. మీ పార్టీ కార్యాలయాన్ని మీరే ధ్వంసం చేసుకున్నారని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. మా కార్యాలయాన్ని మేమెందుకు ధ్వంసం చేసుకుంటామన్నారు అచ్చెన్నాయుడు. చెప్పేదానికి అర్థం ఉండాలని కదా అని కౌంటర్ ఇచ్చారు.
ఇలా బీఏసీ సమావేశం హాట్ హాట్ గా నడిచింది. సీఎం జగన్ కూడా అక్కడే ఉండడంతో వైసీపీ నేతలు, మంత్రులు రెచ్చిపోయారు. అచ్చెన్న టార్గెట్ గా మాటల తూటాలు పేల్చారు. చివర్లో సీఎం జగన్ కూడా మీ వాళ్లు ఒకటంటే మా వాళ్లు పది అంటారంటూ చివర్లో గట్టిగానే హెచ్చరించారు. దీంతో అధికార, ప్రతిపక్షాల మధ్య యుద్ధం మరింత ముదిరిందని చెప్పొచ్చు.













