సుప్రీంకోర్టుకు చేరిన రాజధాని రగడ.. హైకోర్టు తీర్పును సవాల్ చేసిన జగన్ సర్కార్!
ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది..? అంటే ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. అమరావతా లేకుంటే మూడు రాజధానులని చెప్పాలా.. అని దిక్కులు చూడాల్సి వస్తోంది. ఏపీ ప్రజలకు ఇంతకు ముందెప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదురు కాలేదు. రాష్ట్ర విభజన జరిగిపోయి 8 ఏళ్లయింది. అయినా ఇంతవరకూ ఏపీ రాజధానిపై మాత్రం స్పష్టత రాలేదు. వచ్చే ఎన్నికలనాటికైనా స్పష్టత వస్తుందా అంటే చెప్పలేని పరిస్థితి. అధికార, ప్రతిపక్షాల మధ్య రాజధాని అంశం కొరకరానికొయ్యలా మారింది.
2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలుగుదేశం పార్టీ ఏపీలో అధికారంలోకి వచ్చింది. పలు కమిటీల నివేదికల అనంతరం అమరావతిని రాజధానిగా నిర్ణయించింది అప్పటి ప్రభుత్వం. వెంటనే ప్రధానీ మోదీతో రాజధాని భవనాలకు శంకుస్థాపనలు కూడా చేయించింది. తాత్కాలికంగా సెక్రటేరియేట్, అసెంబ్లీ తదితర భవనాలను నిర్మించి పాలన సాగించింది. అప్పుడు అమరావతి రాజధానికి ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ కూడా మద్దతు ప్రకటించింది. దీంతో అమరావతికి అడ్డంకులు తొలగిపోయాయి. రైతులు కూడా ముందుకొచ్చి 33 వేల ఎకరాలను ప్రభుత్వానికి అప్పజెప్పారు. దీంతో అమరావతిని అంతర్జాతీయ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దుతామని అప్పటి సీఎం చంద్రబాబు వెల్లడించారు.
అయితే 2019లో టీడీపీ ఓడిపోయి వైసీపీ అధికారంలోకి వచ్చింది. తొలి ఏడాది రాజధానిపై పెద్దగా పట్టించుకోని జగన్ సర్కార్.. రెండో ఏడాది మూడు రాజధానులను తెరపైకి తెచ్చింది. వెంటనే ఆ మేరకు అసెంబ్లీలో తీర్మానం చేసింది. దీనిపై అమరావతి ప్రాంత రైతులు కోర్టుకు వెళ్లడంతో సుదీర్ఘ విచారణ కొనసాగింది. ఇంతలో మూడు రాజధానుల బిల్లును వెనక్కు తీసుకుంటున్నట్టు ప్రభుత్వం హైకోర్టుకు వెల్లడించింది. దీంతో అమరావతే రాజధానిగా ఉంటుందని అందరూ భావించారు. అయితే ఈ ఉత్సాహం ఎంతో కాలం కొనసాగలేదు.
ఇప్పుడు మళ్లీ మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చింది వైసీపీ ప్రభుత్వం. విశాఖలో పరిపాలన రాజధాని, అమరావతిలో శాసన రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలనేది వైసీపీ ప్రభుత్వ ఆలోచన. ఇప్పుడున్న పరిస్థితుల్లో మౌలిక వసతులే లేని అమరావతిని రాజధానిగా తీర్చిదిద్దడం ఖర్చుతో కూడుకున్న పని అని సీఎం జగన్ అసెంబ్లీలో స్పష్టం చేశారు. లక్ష కోట్లకు పైగా ఖర్చు చేయాల్సి ఉందని.. అంతు డబ్బు లేదని తేల్చి చెప్పారు. విశాఖలో పది వేల కోట్లు ఖర్చు పెడితే రాజధాని అందుబాటులోకి వచ్చేస్తుందని ప్రకటించారు. అసెంబ్లీలో సీఎం జగన్ ప్రకటన తర్వాత మూడు రాజధానులను ఏర్పాటు చేయడం ఖాయమని రుజువైంది. అయితే మళ్లీ మూడు రాజధానుల బిల్లును తీసుకొస్తారని అందరూ భావిస్తున్న సమయంలో ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
3 రాజధానుల బిల్లు చెల్లదని.. అమరావతే రాజధాని అని హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది ఏపీ ప్రభుత్వం. రాజధానిపై ఎలాంటి చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు శాసన వ్యవస్థను నిర్వీర్యం చేయడమేనని ఆక్షేపించింది. హైకోర్టు తీర్పుపై వెంటనే స్టే ఇవ్వాలని కోరింది. సీఆర్డీఏ చట్ట ప్రకారం ప్రభుత్వం వ్యవహరించాలంటూ హైకోర్టు ఆదేశించడం శాసన అధికారాలను ప్రశ్నించడమేనని తెలిపింది. అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించింది. అంతేకాక.. ఆరు నెలల్లోపు అమరావతిని అభివృద్ధి చేయాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆచరణ సాధ్యం కాదని స్పష్టం చేసింది.
ఇప్పుడు రాజధాని అంశం సుప్రీంకోర్టుకు చేరింది. హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనేది ఇప్పుడు ఆసక్తి కలిగిస్తున్న అంశం. రాజధానికోసం త్యాగం చేసిన రైతుల పక్షాన నిలుస్తుందా.. లేదా చట్టాలను చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది కాబట్టి.. రాజధాని అంశంపై ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తుందా.. అనేది తేలాల్సి ఉంది.













