ఈ విషయంలో మరో వివాదానికి తావు లేదు : సోము వీర్రాజు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికే బీజేపీ కట్టుబడి ఉందని, ఈ విషయంలో మరో వివాదానికి తావు లేదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. ఈ నెల 11న విశాఖలో ప్రధాని మోదీ పర్యటిచనున్న సందర్భంగా ఎంపీ జీవీఎల్ నరసింహారావుతో కలిసి సోము వీర్రాజు విశాఖలో మీడియాతో మాట్లాడారు. మూడు రాజధానుల పేరుతో ప్రజల్ని మోసం చేస్తున్న వైసీపీని ప్రశ్నించాలని మీడియా ప్రతినిధులకు ఆయన సూచించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు మోదీ శంకుస్థాపన చేస్తారని తెలిపారు. ప్రధాని పర్యటన వివరాలను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ముందే ప్రకటించారని ఆయన మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, కేంద్రం చేస్తున్న అభివృద్ధిపై క్రెడిట్ కొట్టేసేందుకు వైసీపీ ఉబలాటపడుతోందని వ్యాఖ్యానించారు. ప్రధాని సభకు జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఆహ్వానిస్తారా? అని ప్రశ్నించగా సమాధానం చెప్పలేదు. విశాఖపట్నంలో అభివృద్ధి అంతా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరుగుతోందని అన్నారు.













